YSRCP Plenary 2022 : ప్లీనరీకి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆహ్వానాలు అందని వారు కూడా ప్లీనరీకి రావొచ్చని విజయసాయి రెడ్డి తెలిపారు.  వైసీపీ పరిపాలనే గీటు రాయిగా ప్లీనరీ నిర్వహిస్తున్నామన్నారు. ప్లీనరీ విజయవంతం అయ్యాక చంద్రబాబు మళ్లీ బోరున ఏడుస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూతపడకపోయినా చంద్రబాబు పదే పదే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానన్న బాబు మాట తప్పారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు చేయలేని జిల్లాల పునర్విభజనను సీఎం జగన్ చేశారన్నారు. మూడేళ్లలో రూ. 1.6 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా ఇచ్చామన్నారు. సంక్షేమం-అభివృద్ధిలో ఏపీ దేశంలోనే ముందుందన్నారు. 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. 


ఇదే ఆహ్వానం 


పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. గత రెండు ప్లీనరీలు ప్రతిపక్షంలో ఉండగా జరిగితే. ఈసారి అధికార పక్షంగా మూడేళ్ల పాలన తర్వాత జరుగుతున్న ప్లీనరీ.  మూడేళ్లు అధికార పక్షంగా నిర్మాణాత్మకంగా సీఎం జగన్ పరిపాలన అందించగలిగారు. కాబట్టి అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఈ ప్లీనరీ జరగబోతుంది. ప్లీనరీకి ఒక క్రమపద్ధతిలో ఆహ్వానాలు పంపించాం. ఆహ్వానాలు అందనివారు ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో నా ఆహ్వానాన్నే,  ప్లీనరీకి ప్రత్యక్ష ఆహ్వానంగా భావించి హాజరు కావాలని కోరుతున్నాను. ఎవరికైనా ఆహ్వానాలు అందకపోతే మా పొరపాటును మన్నించి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకూ ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.- విజయసాయి రెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 


స్కూళ్ల మూసివేతపై 


జులై 8న ప్లీనరీ మొదటిరోజు సుమారు లక్షా 50 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు.  రెండోరోజు 4 లక్షల మంది హాజరు అవుతారన్నారు. రేపటి కార్యకర్తల సభకు అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచీ, అన్ని గ్రామాల నుంచీ కార్యకర్తలంతా తరలివస్తారన్నారు. ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్లీనరీ విజయం స్పష్టంగా కనిపిస్తున్నందు వల్ల చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పరాకాష్టకు చేరిందన్నారు.14 ఏళ్లు అధికారంలో ఉన్నన్నాళ్ళు, ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు, ఇప్పుడు తాను చేసిన కార్యక్రమాలు ఇవీ అని చెప్పకుండా తెల్లారిలేస్తే, విమర్శల మీదే బతుకుతున్నారన్నారు. 8 వేల గ్రామాల్లో స్కూళ్లు మూసేశారని ఆరోపిస్తున్నారని, నిజానికి ఒక్క స్కూల్ కూడా మూసి వేయలేదన్నారు. సీఎం జగన్ అయ్యాక నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారన్నారు. వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత అంశాలను తీసుకుంటే దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందన్నారు. 


ఇంటికో ఉద్యోగం ఏమైంది? 


అధికారంలోకి వచ్చిన వెంటనే, 2 లక్షలమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, వాలంటీర్లతో కలుపుకుని మొత్తం నాలుగు లక్షల మందిని సచివాలయ వ్యవస్థ ద్వారా నియమించారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఆర్బీకేలు ఏర్పాటు, ప్రతి గ్రామంలో వైద్యం అందించేందుకు విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనను సంస్కరణల బాట పట్టించారన్నారు. చంద్రబాబు గతంలో ప్రతి ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని వాగ్దానం చేశారని, ఒకవేళ ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్నారు. ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. లిక్కర్‌ బ్రాండ్స్‌ విషయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క డిస్టలరీకి కొత్తగా అనుమతి ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 20 డిస్టలరీలకు ఎవరు అనుమతి ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. గతంలో ఎన్నడూ లేని 254 కొత్త లిక్కర్‌ బ్రాండ్లకు చంద్రబాబే అనుమతి ఇచ్చారన్నారు. 


మా పరిపాలనే గీటు రాయిగా ప్లీనరీ


సీఎం జగన్‌ పరిపాలనకు గీటురాయిగా ప్లీనరీ జరుగుతుంది. మేం చేసిన మంచి పనులన్నీ ప్లీనరీలో చెబుతాం. విద్యా, వైద్య రంగం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారితపై ప్లీనరీలో చర్చిస్తాం. తీర్మానాలు ఆమోదిస్తాం. మా ప్లీనరీ సమావేశాలపైన కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకు వస్తున్నట్లుగా టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్లీనరీ సమావేశాలకు పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు మాత్రమే హాజరుఅవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మిగతావారు ఎవరికీ మేము ఆహ్వానం పంపించలేదు. - విజయసాయి రెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 


25 రకాల వంటకాలతో భోజనాలు


ప్లీనరీలో పెట్టే భోజనాల విషయంలో కూడా టీడీపీ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. సమాజంలో వెజిటేరియన్స్‌, నాన్‌ వెజిటేరియన్స్‌ ఉంటారని, అందుకు తగ్గట్టుగానే ప్లీనరీ సమావేశాల్లో 25 రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశామన్నారు. ప్లీనరీలో పంది మాంసం పెడుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్లీనరీ ఘన విజయాన్ని చూసిన తర్వాత 10వ తేదీన మరిన్ని ప్రెస్‌మీట్లు పెట్టి బహుశా చంద్రబాబు బోరుబోరున మరోసారి ఏడుస్తారనే విషయం అర్ధం అవుతోందన్నారు. ప్లీనరీ సమావేశాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్లీనరీకి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరు అవుతారన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై మొదటి రోజు తీర్మానం ప్రతిపాదిస్తామన్నారు. మరుసటి రోజు ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 2024 ఏప్రిల్‌లో ఎన్నికలు వెళ్లాల్సిందే అని, ముందస్తు  ఎన్నికలకు తొందరెందుకన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే సీఎం అవుతానని చంద్రబాబు కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతోందని విజయసాయి రెడ్డి అన్నారు.