Nandigram Cooperative Body Election: బంగాల్‌లో మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా జరిగిన కోఆపరేటివ్ బాడీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
ఒక్క సీటే
నందిగ్రామ్‌లోని భెకూటియా సమాబే కృషి సమితి కోఆపరేటివ్ బాడీ ఎన్నికల్లో భాజపా క్లీన్ స్వీప్ చేసింది. 12 సీట్లకు గాను 11 చోట్ల నెగ్గింది. ఒక్క సీటు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ నెగ్గింది. భాజపా విజయంపై ఆ పార్టీ నేత సువేందు అధికారి స్పందించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీని భాజపా అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. మళ్లీ ఇప్పుడు మమతకు సువేందు మరోసారి షాక్ ఇచ్చారు.
పుంజుకున్న భాజపా
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ భాజపా భారీగా పుంజుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉంది. ఇటీవల అవినీతి కేసుల్లో టీఎంసీ కీలక నేతలు అరెస్ట్ కావడంతో భాజపా జోరు పెంచింది. తాజాగా భాజపా చేపట్టిన 'చలో సచివాలయం' ఆందోళన హింసాత్మకంగా మారింది.
భాజపా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పార్టీ కార్యకర్తలు రైళ్లు, బస్సుల్లో రాజధాని కోల్‌కతాకు బయల్దేరారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా భాజపా వెనక్కి తగ్గకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు కోల్‌కతాకు రాకుండా రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ముందుజాగ్రత్త చర్యగా పలువురు నేతలను అరెస్టు చేశారు. కోల్‌కతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతోన్న ప్రతిపక్ష నేత సువేందు అధికారి, మరో నేత లాకెట్ ఛటర్జీని మార్గమధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దీదీ ప్రభుత్వంపై సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Work From Home Ends: ఇక ఆఫీసులకు రండి- ఉద్యోగులకు TCS పిలుపు!
Also Read: Maharaja Hari Singh: నిజాంకు ఓ న్యాయం- హరిసింగ్‌కు మరో న్యాయమా!