McLeod Russel Shares: మెక్‌లియాడ్‌ రస్సెల్‌ ఇండియా (MRIL) షేర్లు ఉరకలేస్తున్నాయి. కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Carbon Resources Pvt Ltd), ఈ కంపెనీలో దాదాపు 5 శాతం కొనుగోలు చేసిన తర్వాత ఇన్వెస్టర్ల నుంచి ఈ స్టాక్‌కు భారీ స్పందన వచ్చింది. 


మెక్‌లియాడ్‌ రస్సెల్ ఇండియా షేర్లు ఇవాళ (సోమవారం) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) 20 శాతం ర్యాలీ చేసి, రూ.34.25 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఈ స్టాక్‌ అప్పర్‌ సర్క్యూట్‌ కొట్టడం ఇది వరుసగా రెండో ట్రేడింగ్‌ రోజు.  
ఈ నెల 16న (శుక్రవారం), మెక్‌లియాడ్‌ రస్సెల్‌ కంపెనీకి చెందిన 4.95 మిలియన్ ఈక్విటీ షేర్లను కార్బన్ రిసోర్సెస్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇది, MRIL మొత్తం ఈక్విటీలో 4.73 శాతానికి సమానం. NSEలో సగటున రూ.28.19 ధర వద్ద ఈ డీల్‌ జరిగినట్లు డేటా చూపిస్తోంది. ఓపెన్‌ మార్కెట్ లావాదేవీ జరిగింది.


రెండు రోజుల్లో 42 శాతం జూమ్
గత రెండు ట్రేడింగ్ రోజుల్లోనే ఈ స్క్రిప్‌ రూ.24.15 స్థాయి నుంచి 42 శాతం జూమ్ అయింది, ఇవాళ రూ.34.25 వద్దకు చేరింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.35.15. , గతేడాది సెప్టెంబర్ 30న ఈ స్థాయికి చేరుకుంది. మళ్లీ ఇప్పుడు ఆ గరిష్ట స్థాయికి సమీపంలో ఉంది.


ఈ ఏడాది జూన్ చివరి నాటికి, ప్రమోటర్లకు MRILలో 6.25 శాతం వాటా ఉంది. మిగిలిన 93.75 శాతం పబ్లిక్ హోల్డింగ్‌లో, ఇండివిడ్యువల్‌ పబ్లిక్ షేర్‌హోల్డర్లు 67.56 శాతం వాటాను కలిగి ఉండగా, కార్పోరేట్ కంపెనీలు 14.15 శాతం హోల్డింగ్ కలిగి ఉన్నాయి.


ఉదయం 10:32 గంటల వరకు, NSE, BSEలలో కలిపి 2.66 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. మరో 7.68 మిలియన్ షేర్ల కొనుగోలు ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.


కార్బన్ చేయి తగిలాకే గోల్డ్‌ అయింది
గత నెల రోజుల్లో మెక్‌లియాడ్‌ రస్సెల్ కౌంటర్‌ 46 శాతం లాభపడింది. ముఖ్యంగా, ఈ నెల 14వ తేదీ నుంచి నిట్టనిలువుగా ఎదిగింది. గత ఆరు నెలల కాలంలో 50 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) లెక్కేస్తే 17 శాతం జూమ్ అయింది. దీని అర్ధం, YTD ప్రాతిపదికన రెండు రోజుల క్రితం వరకు కూడా ఇది నష్టాల్లోనే ఉంది. కార్బన్ రిసోర్సెస్ చేయి పడ్డ తర్వాతే గోల్డ్‌గా మారింది.


టీ తోటల సాగు, టీ పొడి తయారీ వ్యాపారాన్ని MRIL చేస్తోంది. ఈ కంపెనీకి ప్రస్తుతం అసోం, పశ్చిమ బంగాల్‌లో 33 టీ ఎస్టేట్‌లు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో టీ ఎస్టేట్‌లు ఉన్న కంపెనీల్లో ఇది ఒకటి. ఉత్పత్తి చేసిన తేయాకును దేశీయ మార్కెట్‌లో అమ్మడంతోపాటు యునైటెడ్ కింగ్‌డమ్ సహా యూరప్‌ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.