Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఏపీ, తెలంగాణలోనూ పలు చోట్ల వరుస సోదాలు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పందించారు. మాపై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవి అన్నారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి తమకు ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు.
తమ కుటుంబం 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారంలో ఉన్నదని చెప్పారు. 8 రాష్ట్రాలలో మా వ్యాపారాలు ఉన్నాయని, ఎక్కడ మచ్చ లేని వ్యాపారం చేస్తున్నామని ఎంపీ మాగుంట తెలిపారు. తమ చెన్నె, ఢిల్లీ వివాసాల్లో ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేశారని, కానీ వారికి అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. పోలీసులు పంచనామాలో కూడా ఇదే రాశారని వెల్లడించారు. తమతో పాటు దేశ వ్యాప్తంగా 32 మంది వ్యాపారులపై ఈడీ తనిఖీలు చేపట్టిందన్నారు. మా కుటుంబం రాజకీయాలో, వ్యాపారాలలో నీతిగా ఉన్నామని, ఎక్కడ అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. 2024 లో తన కుమారుడు ఒంగోలు ఎంపీ గా పోటీ చేస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాజాగా ఈడీ జరిపింది కేవలం కేవలం వ్యాపారపరమైన దాడులు గానే భావిస్తున్నామని, ఇవి రాజకీయ దాడులు కానే కాదన్నారు.
లిక్కర్ తయారీ బిజినెస్‌లో ప్రసిద్ధులు మాగుంట కుటుంబం !
ఒంగోలు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి పలు డిస్టిలరీస్ ఉన్నాయి. 35కిపైగా కంపెనీల్లో ఆయన భాగస్వామి. వాటిలో మద్యం తయారు కంపెనీలుఎక్కువ. ప్రముఖ బ్రాండ్ల మద్యం తయారీలో మాగుంట కుటుంబానికి పేరుంది. చెన్నై కేంద్రంగా ఆయన వ్యాపారాలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి. శ్రీనివాసుల రెడ్డి వారసుడిగా ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి కూడా ఈ వ్యాపార వ్యవహారాల్లో భాగస్వామిగా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆరు కంపెనీల్లో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆ క్రమంలోనే దిల్లీ మద్యం టెండర్లలో ఇతరులతో కలిసి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సంబంధించిన వారి కంపెనీలు కూడా టెండర్లు దాఖలు చేయడం, అవి ఖరారు కావడంతో ఢిల్లీ మద్యం విక్రయాల్లో ఒంగోలు ఎంపీ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి.
చట్టబద్ధంగానే కాంట్రాక్టులు టెండర్లు దక్కాయన్న మాగుంట !
నిషేదిత జాబితాలో ఉన్న ఖావో గాలి అనే సంస్థ వైసీపీ ఎంపీ మాగుంటకు చెందిన కంపెనీతో కలసి సిండికేటుగా ఏర్పడిందని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొన్ని లిక్కర్ సంస్థలకు లాభం కల్గిందని కమలనాధులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ లిస్టులో ఒక్క కంపెనీ టెండర్లలో పాల్గొనడమే తప్పు అయితే.. ఆ సంస్థ మరో కంపెనీతో సిండికేట్ కావడం ఏంటని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. అయితే "మాగుంట అగ్రోఫామ్స్ పేరుతో ఉన్న కంపెనీకి బిడ్డింగ్‌లో టెండర్ దక్కింది. అన్నీ సక్రమంగా జరిగాయి. అవకతవకలు జరిగాయన్నది వాస్తవం కాదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెబుతున్నారు.
మళ్లీ మద్యం విధానం మార్చేసిన కేజ్రీవాల్ సర్కార్ !
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఢిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 9 నెలల తర్వాత తన మద్యం విధానం వెనక్కి తీసుకుంది. మళ్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్ముతామని ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచి పాత విధానం అమల్లోకి వస్తుందని చెప్పింది. అయితే మద్యం విధానాన్ని వెనక్కి తీసుకున్నంత మాత్రాన సీబీఐ విచారణ ఆగబోదని.. అక్రమాలకు పాల్పడిన వారిని వదలబోమని బీజేపీ వర్గాలంటున్నాయి. లిక్కర్ టెండర్లు దక్కించుకున్న వారిలో వైఎస్ఆర్‌సీపీ ఉండటంతో ఏపీలోనూ ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.