క్వశ్చన్ అవర్‌లో పోలవరంపై తీవ్రమైన చర్చ జరిగింది. పోలవరం నిర్వాసితులకు ఎకరాలకు పది లక్షలు ఇస్తామన్న విషయంపై మొదలైన చర్చ వాగ్వాదానికి చోటు చేసుకుంది. అసలు అలాంటి హామీ తాము ఇవ్వలేదని తేల్చేశారు మంత్రి అంబటి రాంబాబు. 


2013లో వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మేలు జరుగుతుందన్నారు అంబటి రాంబాబు. వాళ్లకు ఐదు లక్షలు ఎంత తక్కువైతే అంతా ఇస్తామని మాత్రమే చెప్పామన్నారు. మిగతా నిర్వాసితులకు కేటగిరీల వారీగా కేంద్రం పరిహారం ఇస్తుందని... అది పది లక్షలకు ఎంత తక్కువైతే అంతా ఇచ్చేందుకు మాత్రమే హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం నష్టపోయిన రైతులకు ఐదు లక్షలు, కేంద్రం పరిహారంతో సంతృప్తి చెందని ప్రజలకు పదిలక్షలు పరిహారం వచ్చేలా చూసేలా రాష్ట్రం ప్రయత్నిస్తుందన్నారు. 


దీనిపై రియాక్ట్‌ అయిన తెలుగుదేశం సభ్యుడు బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... మంత్రి బాధ్యతారాహిత్యంగా ఉన్నారన్నారు. దీనిపై అధికార పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. తమకు పోలవరంపై చిత్తశుద్ది ఉందన్నారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు అంబటి రాంబాబు.


2018లో జగన్ మోహన్ రెడ్డి పోలవరం సందర్శించి ఇచ్చిన హామీని తెలుగు పార్టీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి సభలో చదివి వినిపించారు. అప్పుడే పది లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టులో నిధులు కోత పెడుతున్నప్పుడు మాట్లాడలేని వాళ్లు కేంద్రం పరిహారంతో మెలిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురాకపోగా... ఎత్తును తగ్గించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మరోసారి దీనిపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఎత్తు తగ్గించబోతున్నారన్న బుచ్చయ్య చౌదరి కామెంట్స్‌పై మంత్రి అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. వక్రభాష్యాలతో మాట్లాడుతున్నారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 


45.72 మీటర్లకు ఎంత మంది మునుగుతున్నారు... ఎంత పరిహారం ఇవ్వాలి... ఎలా ఇవ్వాలి... మాట్లాడాలని... కానీ అప్పట్లో జగన్ ఇచ్చిన హామీలను తాము అడుగుతున్నామన్నారు. ఆ వీడియో తమ దగ్గర ఉందని.. దాన్ని వేసే దమ్ము అధికార పార్టీకీ ఉందా అని ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి. 25వేల కుటుంబాలను తరలించాల్సి ఉండగా... ఇంకా ఎనిమిది వేలకుపైగా కుటుంబాలు ముంపులోనే ఉన్నాయన్నారు. వారిలో ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారో లిస్ట్ ఇమ్మంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్, కాఫర్ డ్యామ్‌ వీటన్నింటిపై సమాధానం చెప్పడం లేదన్నారు బుచ్చయ్య చౌదరి. 


బుచ్చయ్య చౌదరి మాట్లాతుండగానే మరోసారి అంబటి అభ్యంతరం లేవనెత్తారు. వాళ్లు అడిగిన ప్రశ్న ఏంటీ వాళ్లు ఏమాట్లాడుతున్నారు అంటూ నిలదీశారు. వాటిపై మాట్లాడాలంటే తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబును రమ్మంటే అన్నింటికీ సమాధానం చెప్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుల వల్ల పోలవరంలో పనులు ఆగిపోయాయన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ వేసి కాఫర్‌ డ్యాం కంప్లీట్ చేయలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా కాఫర్ డ్యాం కంప్లీట్ చేసిన తర్వాతే మిగతా పనులు చేస్తారన్నారు. కాఫర్‌ డ్యాం కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ ఎలా నిర్మించారో... కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నారో... 2018కి పూర్తి చేస్తామని చెప్పిన వాళ్లు ఎందుకు పూర్తి చేయలేదో ఈ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలన్నారు అంబటి. 


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కారణంగా పోలవరంపై అదనంగా 3వేల కోట్లు భారం పడుతుందన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని కానీ.. వేరే దేశంలో అయితే పోలవరానికి చేసిన అన్యాయానికి ఉరేస్తారని హాట్ కామెంట్స్ చేశారు. పోలవరంలో చంద్రబాబు చేసిన అన్యాయం తరతరాలు వేధిస్తుందన్నారు. 


పోలవరం విషయంలో అంబటి రాంబాబు రెండో కృష్ణుడని... ఇంతక ముందు ఉన్న వ్యక్తి రకరకాల డెడ్‌లైన్‌లు పెట్టారని అన్నారు బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ఎప్పటికి పూర్తవుతుందని వీళ్లకు ఎవరకూ తెలియదన్నారు. నిర్వాసితులకు పదిలక్షలు ఇస్తామని చెప్పి రంపచోడవరంలో జగన్ ఇచ్చిన హామీ సాక్షి పేపర్‌లోనే వచ్చిందని గుర్తు చేశారు బుచ్చయ్య చౌదరి. దీనిపై సీఎం జగన్ కలుగ చేసుకొని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.