ముంబయి పేలుళ్ల సూత్రధారికి జైలు శిక్ష
పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. 2008లో ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారికి 15 ఏళ్ల జైలు శిక్షవిధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇలా తీర్పునిచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన యాక్టివిస్ట్ సాజిద్ మజీద్ మిర్‌కు లాహోర్ కోర్ట్ ఈ శిక్ష వేసింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులను వాదించే ఓ సీనియర్ న్యాయవాది ఈ వివరాలు వెల్లడించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్-CTD ఈ తరహా కేసుల్లో శిక్ష పడిన వాళ్ల వివరాలను మీడియాకు వెల్లడిస్తుంది. కానీ ఈ కేసులో ఆ సమాచారాన్ని బయటకు పొక్కనివ్వలేదు. జైల్‌లో కెమెరా ప్రొసీడింగ్ కొనసాగటం వల్ల మీడియాను అనుమతించలేదు.
జైలు శిక్షతో పాటు జరిమానా కూడా..
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మజీద్ మిర్‌ను ఏప్రిల్‌లోనే అరెస్ట్ చేశారు. కోట్ లఖ్‌పత్ జైల్‌లో ఉంచారు. అప్పటి నుంచి విచారణ అంతా జైల్‌లోనే సాగింది. ఈ ప్రక్రియ ముగిశాక లాహోర్ కోర్ట్ శిక్ష విధించింది. 15ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 4 లక్షలు జరిమానా కూడా విధించినట్టు న్యాయవాది తెలిపారు. నిజానికి మజీమ్ మిర్ ఎప్పుడో చనిపోయి ఉంటారనే అంతా భావించారు. కానీ పాకిస్థాన్ ఉన్నట్టుండి ఓ ప్రకటన చేసింది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో ఎప్పటి నుంచో గ్రే లిస్ట్‌లో ఉండిపోయిన పాక్, ఆ మచ్చను తొలగించుకునే ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని సంచలన నిజం వెల్లడించింది. మజీద్ మిర్ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రకటన వచ్చింది. ముంబయిలో 26/11 దాడుల్లో కీలక పాత్ర పోషించిన సాజిద్ భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోనూ ఉన్నాడు. ముంబయి దాడుల్లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా సాజిద్ వ్యవహరించాడని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.
గ్రే లిస్ట్‌లో నుంచి బయటపడేనా..?
2005లో నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్‌కు వచ్చాడు సాజిద్. జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది లాహోర్ కోర్ట్. ముంబయి అటాక్ ఆపరేషన్ కమాండర్ జకీర్ రెహమాన్ లఖ్వీని కూడా కొన్నేళ్ల పాటు జైల్‌లో ఉంచారు. సయీద్‌ను అంతర్జాతీయఉగ్రవాదిగా గుర్తించింది ఐక్యరాజ్య సమితి. 2019లో సయీద్ అరెస్ట్ అయ్యాడు. ముంబయిదాడుల్లో ఆరుగురు అమెరికన్లూ మృతి చెందటం వల్ల అగ్రరాజ్యం కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏటీఎఫ్ పాకిస్థాన్‌కు సూచనలు చేస్తూనే ఉంది. అయినా పాక్ తీరు మారలేదు. ఫలితంగా 2018 నుంచి గ్రే లిస్ట్‌లోనే ఉంచింది. ఈ జాబితాలో ఉన్నంత కాలం పాకిస్థాన్‌కు ఏ దేశమూ సాయం చేసేందుకు ముందుకు రాదు. ఇమ్రాన్ ఖాన్ హయాంలో పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోటానికి కారణం ఇదే.