Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ ఇటీవల హెచ్చరించింది. భారీ వర్షం కురిసే సమయంలో పాత ఇళ్లల్లో ఉండవద్దని, చెట్ల కిందకు వెళ్ల వద్దని ప్రజలకు సూచించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. విశాఖతో పాటుగా అనకాపల్లి, కాకినాడ జిల్లాలోని కొన్ని భాగాలు, విజయనగరం జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాలకు వర్ష సూచన ఉంది. కాకినాడ, రాజమండ్రిలో తేలికపాటి జల్లులు పడేతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
కోస్తాంధ్రలో వర్షాలు మరింత ఎక్కువ కానుండగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. గుంటూరు, పల్నాడు, విజయవాడ, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి.
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయని పేర్కొంది.
హైదరాబాద్‌లో నేడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు మరియు 24 డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ ఉపరితల గాలులు, గాలివేగం గంటకు 8 నుంచి 14 గంటల వేగంతో వీచే అవకాశం ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.