స్మార్ట్ సిటీ వైజాగ్‌లో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరిగిన కొద్దీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపూరిత లింకులు పంపి క్లిక్ చెయ్యగానే ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి వాటిపై అంతగా అవగాహన లేని వృద్ధులు,పెన్షన్‌దారులను లక్ష్యంగా చేసుకుని విజృంభిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు .
లాటరీ తగిలింది అంటూ
కోట్ల విలువైన లాటరీ తగలింది అంటూ మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకరోజు గుర్తుతెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చే ఉంటుంది. ఆ లాటరీ డబ్బు పొందాలంటే ఆ మెసేజ్‌తోపాటు వచ్చిన లింక్‌ని క్లిక్ చెయ్యమని ఉంటుంది. ఒక్కసారి గానీ ఆశపడి క్లిక్ చేసారో.. అంతే.. మీ బ్యాంక్ అకౌంట్ లోని అమౌంట్ మొత్తం మటాషే అంటున్నారు పోలీసులు. ఆల్రెడీ అందరికీ తెలిసిన సంస్థల, బ్యాంకుల స్పెల్లింగులో చిన్నచిన్న తేడాలతో వెబ్సైట్ అడ్రెస్‌లు ఇవ్వడం.. దాని నుంచి లింకులు పంపడం వంటి పనులు ఈసైబర్ నేరగాళ్లు చేస్తుంటారు.
మీ ఫోన్‌కు వెరిఫికేషన్ ఓటీపీ పంపాము. ఒక్కసారి చెప్పండి అంటూ అడగడం.. చెప్పగానే అకౌంట్‌లలోని డబ్బుని ట్రాన్స్ ఫర్ చేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసెయ్యడం వంటి నేరాలు వైజాగ్‌లో పెరుగుతున్నాయి. ఈ బ్యాంకుగానీ, ప్రభుత్వ సంస్థ గానీ ఓటీపీలు అడగవనీ.. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైజాగ్ పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ సూచిస్తున్నారు. అలాగే సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్,ఫేస్ బుక్ , ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో పరిచయం లేని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని ఆయన అంటున్నారు.
వైజాగ్ ఒక్క సిటీలోనే 2018లో 201 సైబర్ కేసులు నమోదైతే ఈ ఏడాది సగం కూడా ముగియకుండానే ఇప్పటికే 299 కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరు నెలల్లోనే సైబర్ నేరగాళ్ల బారినపడి జనం పోగొట్టుకున్న డబ్బు 5కోట్ల రూపాయలు దాటింది అని, గనుక అపరిచిత వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓపెన్ చెయ్యవద్దనీ, అలాగే ఎంత తెలిసినవారైనా సరే ఓటీపీ పాస్ వర్డ్‌లను చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.