Minister Jogi Ramesh Comments on Pawan Kalyan: రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తుంటే అది జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు కనిపించడం లేదా.? అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ప్రధాని మోదీకి (PM Modi), పవన్ లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కు అసలు ఏపీలో ఆధార్ కార్డు, ఓటు కార్డు లేవని.. ఆయన చంద్రబాబు కోసమే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 'ఏ ఆధారాలతో పవన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆయన చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తున్నాం. ఏపీలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలోనూ జరగలేదు. కేవలం పట్టాలతోనే సరిపెట్టకుండా 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. ఇప్పటికే చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఏం స్కాం జరిగిందో పవన్ చెప్పాలి.' అని నిలదీశారు. 


ప్రధానికి లేఖ రాస్తాం


అక్క చెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని, పవన్ కల్యాణ్ లేవనెత్తిన 13 అంశాలకు సమాధానాలను మీడియా ద్వారా అందజేస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ తెలిపారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం ఏ పనైనా చేస్తారని, స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీద పవన్ ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో పవన్ కు సైతం వాటా ఉంది. చంద్రబాబు కొట్టేసిన డబ్బులో పవన్ కల్యాణ్ కు ఎంత ముట్టిందో విచారణ చేయాలని తాము కూడా ప్రధాని మోదీకి లేఖ రాయబోతున్నామని చెప్పారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ కోరతామన్నారు. చంద్రబాబు ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసినప్పుడు ఎందుకు పవన్ అడగలేదని నిలదీశారు. '14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారో పవన్ ప్రశ్నించారా.?. పవన్ కు బుద్ధి ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలి. ఏ గ్రామానికైనా వెళ్దాం. ఏ సంక్షేమ పథకం ఎవరు అమలు చేశారో ప్రజలనే అడుగుదాం.' అంటూ సవాల్ చేశారు. ప్రజలను మోసం చేసిన అప్పటి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కూడా భాగస్వామేనని, వీరి పాపం పండిందని అన్నారు. 'సీఎం జగన్ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రధానికి లేఖ రాస్తారా.?. చంద్రబాబు, లోకేశ్ దోచుకున్న డబ్బుల మీద లేఖ రాయి.' అంటూ హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ఎంత మంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, జగన్ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. 


కాగా, ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) 5 పేజీల లేఖ రాశారు. దీనిపై సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. 'వైసీపీ పాలనలో భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్లు దుర్వినియోగం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తైతే 86,984 మందికే ఇళ్లు ఇచ్చారు. వీటన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.' అని లేఖలో కోరారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: New Year Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ - మందుబాబులకు గుడ్ న్యూస్, వేడుకల సందర్భంగా పోలీసుల కఠిన ఆంక్షలు