AP Excise Department Allowed Wineshops Upto Mid Night on December 31st And January 1st: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 (ఆదివారం), జనవరి 1 (సోమవారం) తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి 12 వరకు తెరిచే ఉంటాయని ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారులు తెలిపారు. అలాగే, బార్లు, క్లబ్బులు, అనుమతితో జరిగే ఈవెంట్లలో రాత్రి ఒంటి గంట వరకూ మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


వేడుకలపై ఆంక్షలు


మరోవైపు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) నగరంలో సెక్షన్ 30, 144 సెక్షన్ అమలు చేస్తున్నామని సీపీ కాంతారాణా టాటా తెలిపారు. ప్రతి చోటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, డిసెంబర్ 31 (ఆదివారం)వ తేదీ అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చే అల్లరి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై ఎవరూ గుంపులుగా తిరగొద్దని, ఐదుగురి కంటే గుమిగూడకూడదని చెప్పారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకూ విజయవాడలో అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తామని పేర్కొన్నారు. జనవరి 1న ఎంజీ రోడ్డు, బందర్ రోడ్డు పైవంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ దృష్ట్యా నగర ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్లపై కేకులు కోసేందుకు అనుమతి లేదని వెల్లడించారు. హోటల్స్ లో లిక్కర్ పంపిణీకి ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు.


విశాఖలోనూ


విశాఖలోనూ (Visakha) న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఆది, సోమవారాల్లో ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. డిసెంబర్ 31న రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట, పెందుర్తి జంక్షన్ నుంచి ఎన్ఏడీ జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకూ మధ్య BRTS రోడ్డు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అండర్ పాస్ కూడా మూసివేయనున్నారు. కాగా, ఆర్కే బీచ్ సందర్శనకు వచ్చే వారు, వాహనాల పార్కింగ్ కు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఇచ్చారు. అటు, హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వాహకులు అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విశాఖ సీపీ డాక్టర్ ఏ.రవిశంకర్ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగు సిబ్బందినే వారే నియమించుకోవాలని స్పష్టం చేశారు.


అటు, తెలంగాణలోనూ (Telangana) న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని, తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10 వేల జరిమానా సహా జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.


Also Read: CM Jagan : ఓ వైపు షర్మిల - మరో వైపు ధిక్కారం - విపక్షాల ఐక్యత ! అభ్యర్థుల మార్పుపై సీఎం జగన్ పునరాలోచన ?