పాలను సంపూర్ణ పోషకాహారం అంటారు. పసిపిల్లల్లో పరిపూర్ణ ఎదుగుదలకు పాలు చాలా దోహదం చేస్తాయి. అయితే పిల్లల ఎదుగుదలకు కారణమయ్యే పాలు చాలా మంది పేదవాళ్లకు అందుబాటులో ఉండడం లేదు. ద్రవ్యోల్బణం కారణంగా రోజురోజుకు పెరుగుతున్న పాల ధరలు పేదవాడికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ గ్రామంలోని ప్రజలు పాలను ఉచితంగా అందిస్తున్నారు. వారు పాలను ఉచితంగా అందించడానికి కారణమేమిటో.. ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకుందామా?
ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పాటు పెరిగే పాల ధరలు పేదవాడికి అందుబాటులో ఉండడం లేదు. నగరాల్లో నాణ్యమైన పాలు 80 నుంచి 100 రూపాయల దాకా ఉండగా, పల్లెల్లోనూ 60 నుంచి 70 రూపాయలకు లభిస్తున్నాయి. దీంతో తమ పిల్లలకు పాలు అందించేందుకు వారు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. పెరుగుతున్న ధరల కారణంగా పాలు, పాల పదార్థాలు పేద పిల్లలకు ఖరీదైన ఆహారంగా మారాయి. పసి పిల్లలకు నాణ్యమైన పాలు అందుబాటులో లేకపోవడంతో వారిలో పోషకాహార కొరత ఏర్పడుతోంది.
ఉచితంగా పాలు, లస్సీ అందిస్తున్న గ్రామం
పాలను ఉచితంగా అందించే ఆ గ్రామం పేరే నాథువన్. హర్యానా రాష్ట్రంలోని భివానీ నగరానికి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో గ్రామస్తులు ఉచితంగా పాలను అందిస్తారు. ఈ గ్రామంలో 750 ఇళ్లు ఉన్నాయి. నాథువన్ గ్రామంలోని ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఆవులు, గేదెలు ఉంటాయని మీకు తెలుసా? కానీ ఇప్పటికీ ఆ గ్రామంలోని ఎవరూ కూడా పాల వ్యాపారం చేయరు. పాలను వారు ఆదాయ వనరుగా చూడరు. అవసరమైన వారికి పాలను ఉచితంగా అందిస్తారు కానీ వారు పాలను అస్సలు అమ్మరు.
ఉచితంగా పాలు అందించడానికి కారణమిదే!
నూట యాభై ఏళ్ల కిందట గ్రామంలో భయంకరమైన అంటువ్యాధి వ్యాపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ సమయంలో జంతువులు ఒక్కొక్కటిగా చనిపోసాగాయి. గ్రామస్తులు అందరూ భయాందోళనలకు గురయ్యారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన మహంత్ ఫూల్పూరి బతికి ఉన్న జంతువులను చెట్టుకు కట్టి, అప్పటి నుంచి గ్రామంలో పాలు విక్రయించరాదని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో వారంతా మహంత్ మాటకు కట్టుబడి పాలు అమ్మడం మానేశారు. తర్వాత నెమ్మదిగా పరిస్థితులు చక్కబడ్డాయని చెప్పారు. ఈ ఘటన అనంతరం గ్రామంలో ఎవరైనా పాలు అమ్మేందుకు యత్నిస్తే వారికి ఏదో ఒకటి జరగ కూడనిది జరిగేదని చెబుతున్నారు.
ఈ సంప్రదాయంతో ప్రయోజనాలెన్నో!
పాలను విక్రయించరాదన్న కట్టుబాటుతో తమకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామంలో 150 ఏళ్లుగా పాలు అమ్మడం లేదు. ఇప్పుడు దానిని విశ్వాసం లేదా మూఢనమ్మకం అనుకోండి కానీ, దశాబ్దాలుగా గ్రామంలోని జంతువులలో ఎటువంటి అంటువ్యాధులు సోకలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ సంప్రదాయంతో పెద్ద ప్రయోజనమే ఉందని అంటున్నారు. గ్రామంలో వివాహం లేదా ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పాలు ఉచితంగా లభిస్తాయి. గ్రామంలోని పిల్లలకు తాగడానికి కల్తీ లేని నాణ్యమైన పాలు సరిపడా అందడంతో వారి ఆరోగ్యానికి మేలు కలుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial