MILAN 2024 Indian Navy: నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 నుంచి 27వ తేదీ వరకు రెండు ఫేజ్ లుగా జరగనున్న మిలాన్ - 2024 వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని, సంబంధిత ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున సూచించారు. స్థానిక వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో నేవీ, ఎయిర్ పోర్టు, పోర్ట్ అథారిటీ, కస్టమ్స్, రెవెన్యూ, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, పోలీసు, పర్యాటక శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాలు చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశకాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు.
సమావేశంలో భాగంగా మిలాన్ - 2024 ఇన్‌ఛార్జి, నేవల్ కమోడో సిరజ్ అజాద్ 12వ ఎడిషన్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 19 నుంచి 23వ తేదీ వరకు హార్బర్ ఫేజ్, 24 నుంచి 27వ తేదీ వరకు సీ ఫేజ్ మిలాన్ -2024 కార్యక్రమాలు జరుగుతాయని, దీనికి దేశ విదేశాల నుంచి అతిథులు విచ్చేస్తున్నారని వివరించారు. ఉప రాష్ట్రపతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. 50 విదేశీ నౌకలు, 40 వరకు యుద్ద నౌకలు, సబ్ మెరైన్లు మిలాన్ వేడుకల్లో భాగస్వామ్యం కానున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో దేశ, విదేశాల నుంచి వచ్చే నౌకలు విశాఖపట్టణం పోర్టు, నేవల్ డాక్ యార్డుకు చేరుకుంటాయని చెప్పారు.
19వ తేదీన విదేశీ ప్రముఖులు నగరానికి విచ్చేస్తారని పేర్కొన్నారు. 21వ తేదీ నుంచి ప్రధాన కార్యక్రమాలు ఉంటాయని దానిలో భాగంగా 21వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి విచ్చేస్తున్నారని వెల్లడించారు. నేవల్ ఆడిటోరియం సముద్రికలో 21న హార్బర్ ఫేజ్ వేడుకలు ప్రారంభమవుతాయని సిరజ్ అజాద్ వివరించారు. అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి చేతుల మీదుగా నేవల్ బేస్ లో అదే రోజు సాయంత్రం మిలాన్ విలేజ్ ప్రారంభోత్సవం కూడా ఉంటుందన్నారు. 22వ తేదీన ఉప రాష్ట్రపతి విచ్చేస్తున్నారని నేవల్ ఆడిటోరియం సముద్రికలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. అదే రోజు సాయంత్రం బీచ్ వేదికగా జరిగే ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి వేడుకల్లో భాగస్వామ్యం అవుతారని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున మాట్లాడుతూ.. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 19 నుంచి 23వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్బర్ ఫేజ్ (ఆర్.కె. బీచ్ ప్రాంతంలో జరిగే) మిలాన్ - 2024 వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. వీవీఐపీ, వీఐపీ రక్షణ ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు చెప్పారు. ప్రజలు వీక్షించేందుకు అనువుగా బీచ్ ఏరియాలో బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి, బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఏర్పాట్లలో భాగంగా ముందుగా ఆయా విభాగాల అధికారులు వేడుకలు జరిగే ప్రాంతాల్లో జాయింట్ ఇన్సెఫెక్షన్ చేయాలని సూచించారు.
సీసీటీవీ కెమెరాలు, ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలని చెప్పారు. బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఏపీఐఐసీ, ఏయూ గ్రౌండ్స్‌లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సుందరీకరణ పనులు చేపట్టాలని, విశ్వప్రియ ఫంక్షన్ హాలు, విశాఖ మ్యూజియంలో కూడా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆయా రోజుల్లో సముద్రంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా మత్స్యకారులకు ముందుగానే సమాచారం అందించి అప్రమత్తం చేయాలని మత్స్యశాఖ జేడీకి సూచించారు. డ్రోన్లు, గాలిపటాలు ఎగురవేయకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంలో ఎలాంటి లోపం జరగకుండా అన్ని విభాగాల అధికారులు, నేవీ అధికారులు సమన్వయం వహించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని, వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. బీచ్ రోడ్లో శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అతిథులను ఆకర్షించేలా నిర్వహించాలన్నారు. అతిథులకు నగరంలో పలు పర్యాటక ప్రాంతాలను చూపించాలని, సంబంధిత ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు.
సమావేశంలో కమోడో రాజ్ నీష్ శర్మ, పలువురు నేవీ కమాండర్లు, లెఫ్టినెంట్ కమాండర్లు, డీసీపీ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, డీఎఫ్ వో, వీఎంఆర్డీఏ సెక్రటరీ, జీవీఎంసీ ఈఈ, మత్స్యశాఖ జేడీ, సమాచార పౌర సంబంధాల శాఖ జేడీలతో పాటు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.