AP EDCET Counselling: బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహణలో జాప్యాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జాతీయ కన్వీనర్ మోర్త రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ఏపీఎడ్ సెట్-2023 కన్వీనర్‌ను (ఆంధ్రా యూనివర్సిటీ) వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2023 మార్చిలో నోటిఫికేషన్ జారీచేసి, జూన్‌లో పరీక్ష నిర్వహించి, జులై 14న ఎడ్‌సెట్ ఫలితాలను ప్రకటించారని 10,908 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఫలితాలు వెల్లడై ఆరునెలలు పూర్తయినా కౌన్సెలింగ్ నిర్వహించలేదన్నారు. దీంతో విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకపోవడానికి గల కారణాలను సైతం అధికారులు వెల్లడించడం లేదన్నారు. తక్షణం కౌన్సెలింగ్‌ను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 14న ఎడ్‌సెట్‌-2023 నిర్వహించగా.. జులై 14న ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్ష కోసం 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,235 (82.17 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో మొత్తం 10,908 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.


ఆంధ్రప్రదేశ్‌‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి 'ఏపీ ఎడ్‌సెట్‌-2023' పరీక్షను ఏపీ ఉన్నత విద్యామండలి గతంలో వాయిదావేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న జరపాల్సిన పరీక్షను జూన్ 14న నిర్వహించింది. అదేవిధంగా ఏపీ ఎడ్‌సెట్‌ రిజిస్ట్రేషన్ గడువును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు రూ.1000 ఆలస్య రుసుముతో మే 22 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 29 వరకు దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులకు మే 26 నుంచి 30 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఎడ్‌సెట్ పరీక్ష బాధ్యతను తిరుపతి-శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చేపట్టింది.


పరీక్ష విధానం ఇలా..


➥మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు. 


➥ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.


➥ మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జె్క్టులు ఉంటాయి.


ALSO READ:


హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 2024-2026 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 75 సీట్లను భర్తీచేయనున్నారు. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు క్యాట్‌-2023 ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్‌-2023 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.600, ఈడబ్ల్యూఎస్‌ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...