Microsoft Server Outage: మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య అంతర్జాతీయంగా అలజడికి కారణమైంది. ఉన్నట్టుండి క్లౌడ్ సర్వీస్‌లు నిలిచిపోడం వల్ల అన్ని రంగాలపైనా ఆ ప్రభావం పడింది. క్లౌడ్‌ సర్వీసెస్‌పై ఆధారపడిన ఎయిర్‌లైన్స్‌తో పాటు బ్యాంకింగ్‌, హాస్పిటల్ నెట్‌వర్క్‌లపైనా ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సమస్యను గుర్తించినప్పటికీ మైక్రోసాఫ్ట్‌ ఇంకా దీన్ని పరిష్కరించలేదు. వీలైనంత త్వరగా చేస్తామని ప్రకటన మాత్రం చేసింది. ఈ Blue Screen Error కారణంగా Microsoft 365 యాప్స్, సర్వీసెస్‌పైనా ప్రభావం పడింది. అంతే కాదు. అమెరికాలో 911 సర్వీస్‌లూ ఎఫెక్ట్ అయ్యాయి. ల్యాప్‌టాప్‌లు, పీసీల స్క్రీన్‌లపై Blue Screen of Death ఎర్రర్ కనిపిస్తోంది. ఉన్నట్టుండి పీసీలు షట్‌ డౌన్‌ అవడంతో పాటు రీస్టార్ట్ అవుతున్నాయి. సేవ్ చేయని డేటా అంతా ఒక్కసారిగా చెరిగిపోయింది. బ్యాంకింగ్ సెక్టార్‌పై గట్టి ప్రభావం చూపించింది ఈ సాంకేతిక సమస్య. కొన్ని బ్యాంక్‌లలో సిస్టమ్‌కి యాక్సెస్ లేకుండా పోయింది. ఆస్ట్రేలియాలో బ్యాంక్‌లు పని చేయడం లేదు. అటు న్యూజిలాండ్‌లోనూ ఇదే సమస్య తలెత్తింది. ఆస్ట్రేలియాలో అతి పెద్ద బ్యాంక్‌ అయిన  Commonwealth Bankలో ఫండ్ ట్రాన్స్‌ఫర్ పూర్తిగా నిలిచిపోయింది. మరి కొన్ని బ్యాంక్‌ల పరిస్థితీ ఇంతే. సోషల్ మీడియాలో నెటిజన్‌లు పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు. బ్యాంక్‌ సర్వీస్‌లేవీ పని చేయడం లేదని వాపోతున్నారు. 






ఇక ఫ్లైట్ సర్వీస్‌లపైనా ఇదే స్థాయిలో ప్రభావం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పలు ఎయిర్‌లైన్స్‌ సేవలకు అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు రద్దు కాగా, మరి కొన్ని ఆలస్యమయ్యాయి. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లలో చెకిన్ సర్వీస్‌లు పని చేయడం లేదు. రిజర్వేషన్‌లు, బుకింగ్‌లూ ఆగిపోయాయి. కొన్ని చోట్ల మాన్యువల్‌గా చెకిన్‌కి ఏర్పాట్లు చేశారు. స్పైస్‌జెట్‌, ఆకాశ, ఇండిగోతో పాటు అమెరికాలోని ఎయిర్‌లైన్స్‌పై గట్టి ప్రభావం పడింది. నెదర్లాండ్స్, స్పెయిన్‌తో సహా మరి కొన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హాస్పిటల్స్‌లోనూ ఇదే గందరగోళం. యూకేలోని National Health Services నెట్‌వర్క్‌లోని హాస్పిటల్స్‌పై ప్రభావం గట్టిగా పడింది. పేషెంట్ రికార్డ్‌లు చూసేందుకు వైద్యులకు అవకాశం లేకుండా పోయింది. మిగతా హెల్త్‌కేర్ సర్వీస్‌లకూ అంతరాయం కలిగింది. డాక్టర్ అపాయింట్‌మెంట్‌లూ ఆగిపోయాయి. జర్మనీ సహా పలు దేశాల్లోని హాస్పిటల్స్‌ ఇదే సమస్య ఎదుర్కొన్నాయి. The Mirror వెల్లడించిన వివరాల ప్రకారం Microsoft సంస్థ ఈ సమస్యపై విచారణ జరుపుతోంది. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించాలని చూస్తున్నట్టు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్‌పైనా ప్రభావం పడిందని స్పష్టం చేసింది. 


Also Read: Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతికత సమస్య, ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు