Mexico Shooting: సెంట్రల్ మెక్సికోలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ బార్‌లో జరిగిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 




ఇలా జరిగింది


గున‌జుటో స్టేట్‌ బుధవారం రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అపసియోల్ అల్టో పట్టణంలోని బార్‌లోకి వచ్చిన దుండగులు.. విచక్షణారహితంగా దాడి చేశారు. కాల్పుల్లో ఐదుగురు పురుషులు, న‌లుగురు మ‌హిళ‌లు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు గాయాల‌య్యాయి.


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన మ‌హిళల ప‌రిస్ధితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉందని అధికారులు తెలిపారు.


గ్యాంగ్‌వార్


అయితే ఈ కాల్పులకు గ్యాంగ్‌వార్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఓ నేర‌స్తుల గ్రూపున‌కు సంబంధించిన రెండు పోస్ట‌ర్లు ఘ‌ట‌నా స్ధ‌లంలో దుండగులు విడిచివెళ్లినట్లు పోలీసులు తెలిపారు. గున‌జుటోలో త‌ర‌చూ గ్యాంగ్ వార్స్ జ‌రుగుతుంటాయి. 


మెక్సికోలో గత నెలలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. ఓ బార్‌లో దుండగుడు చేసిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.గ్వానాజువాటోలోని ఇరాపువాటోలోని ఓ బార్‌లో ఈ ఘటన జరిగింది. ఓ సాయుధుడు బార్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశాడు. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు.


తుపాకీల మోత


మెక్సికోలో ఎక్కువ హింస జరిగే ప్రాంతాల్లో మిచోవాకాన్ ఒకటి. ఇక్కడ రెండు వర్గాలు నిత్యం కాల్పులు జరుపుకొంటూ ఉంటాయి. కాల్పుల్లో ప్రతి ఏటా వందల మంది మరణిస్తుంటారు.


డ్ర‌గ్ ట్రాఫికింగ్ స‌హా ప‌లు చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డే ప్ర‌త్య‌ర్ధి ముఠాల మ‌ధ్య త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తుతుంటాయి. 2006లో కేంద్ర బ‌ల‌గాల‌తో ప్ర‌భుత్వం యాంటీ డ్ర‌గ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి మెక్సికో డ్ర‌గ్ సిండికేట్ మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. 2006 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో దాదాపు 3,40,000 మందికి పైగా మరణించారు.


ముఠాల వార్


మార్చి మొదటి వారంలో ఓ దుండగుడు ఇలానే కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 17 మంది వరకు మరణించారు. ఇక్కడ ఇలా ముఠా తగాదాలు, కాల్పులు ప్రజలకు అలవాటైపోయాయి. పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇలా కాల్పులు జరిగిన ప్రతిసారి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.


Also Read: Twitter Bankruptcy: ఇది యాపారం- అలా చేయకపోతే ట్విట్టర్ దివాలా ఖాయం!