Meta Layoffs: 


74% మందికి నమ్మకం లేదట..


అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రంగాలపైనా ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా టెక్‌ సెక్టార్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకే...చాలా వరకూ బడా కంపెనీలు లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. మెటా కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అయితే...అన్ని కంపెనీల కన్నా మెటా సంస్థ ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచి విడతల వారీగా లేఆఫ్‌లు చేపడుతోంది. ఈ క్రమంలోనే మెటాలో ఓ ఇంటర్నల్  సర్వే జరిగింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం మెటాలో ఉన్న ఉద్యోగుల్లో సగానికి పైగా ఎంప్లాయిస్‌ జుకర్‌ బర్గ్ లీడర్‌షిప్‌పై "నమ్మకం లేదు" అని తేల్చి చెప్పారు. ఈ రిపోర్ట్‌ని  Wall Street Generalలో పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం...కేవలం 26% మంది మాత్రమే జుకర్‌పై నమ్మకం ఉన్నట్టు వెల్లడించారు. 74% మంది "నమ్మకం లేదు" అని స్పష్టం చేశారు ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకూ సర్వే చేసి ఈ రిపోర్ట్‌ని తయారు చేశారు. ఇటీవలే చివరి రౌండ్ లేఆఫ్‌లు నిర్వహించింది మెటా. ఈ నేపథ్యంలో రిపోర్ట్‌ సంచలనం సృష్టిస్తోంది. గతేడాది అక్టోబర్‌లోనూ ఈ సర్వే చేయగా...అప్పట్లో 31% మంది ఉద్యోగులు జుకర్‌పై విశ్వాసం వ్యక్తం చేయగా...ఆర్నెల్లలో దాదాపు 5% మంది విశ్వసనీయతను కోల్పోయారు జుకర్ బర్గ్. 


ఎందుకీ అసహనం..?


గతేడాది నుంచి దాదాపు 21 వేల మందిని తొలగించింది మెటా. గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని తొలగిస్తామని తొలిసారి ప్రకటన చేశారు జుకర్ బర్గ్. ఆ తరవాత ఈ ఏడాదిలో మరో 10 వేల మందికి ఉద్వాసన పలికారు. ఈ కారణంగా చాలా మంది ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. "ఉద్యోగం ఉంటుందో పోతుందో" అని టెన్షన్ పడుతున్నారు. అందుకే...అంతగా విశ్వసనీయత కోల్పోయారు జుకర్ బర్గ్. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకూ జాబ్ గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇలాంటి కీలక తరుణంలో ఉద్యోగులతో మీటింగ్ పెట్టారు జుకర్‌బర్గ్. మార్చి 16న ఈ సమావేశం జరిగినట్టు The Washington Post వెల్లడించింది. అయితే...ఈ మీటింగ్‌లో ఉద్యోగులందరూ జుకర్‌బర్గ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కంపెనీ పరిస్థితేంటి అని నేరుగానే ఉద్యోగులు జుకర్‌ను ప్రశ్నించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అటు జుకర్ బర్గ్ మాత్రం కంపెనీ రీఆర్గనైజేషన్‌ గురించి మాట్లాడారట. వర్క్‌ఫ్రమ్ హోమ్ గురించి కూడా అడగ్గా...దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని సమాధానమిచ్చారు జుకర్‌బర్గ్. 


"జుకర్‌బర్గ్‌ను ఉద్యోగులు ఎన్నో ప్రశ్నలు వేశారు. ఈ కంపెనీని ఎలా నమ్మమంటారు అని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు రౌండ్‌ల లేఆఫ్‌లు పూర్తయ్యాక...జాబ్ సెక్యూరిటీ పరిస్థితేంటని అడిగారు. అయితే అందుకు జుకర్‌బర్గ్ కూడా సమాధానం చెప్పారు. కేవలం పర్‌ఫార్మెన్స్ ఆధారంగానే లేఆఫ్‌లు చేపడుతున్నట్టు వివరించారు. ఎంప్లాయిస్ అందరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. మనం పెట్టుకున్న ఏ మేరకు చేరుకుంటున్నాం అనే దానిపైనే ఈ లేఆఫ్‌లు ఉంటాయని చెప్పారు. మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. "


- వాషింగ్టన్ పోస్ట్ 


Also Read: Karnataka Shakti Yojana: కర్ణాటక మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, శక్తి స్కీమ్‌ లాంఛ్ చేసిన ప్రభుత్వం