Prakash Javadekar: దేశంలో మరోసారి బీజేపీ సర్కారే వస్తుందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. దేశమే ప్రథమ ప్రాధాన్యంగా మోదీ పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలు కూడా లేవని అన్నారు. బీజేపీ సర్కారు హయాంలో దేశం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. తమది 24 గంటలు పని చేసే ప్రభుత్వమని తెలిపారు. దేశంలో అవినీతి రహిత సర్కార్ ను మొదటి సారి చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడానికి బీజేపీ దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్ సభలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ప్రకాష్ జవదేకర్ ఆదివారం కరీంనగర్ లో పర్యటించి మీడియాతో మాట్లాడారు.
'తెలంగాణ మీద ఎలాంటి వివక్షా లేదు'
కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ జవదేకర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చామని, తెలంగాణ మీద ఎలాంటి వివక్ష లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ సర్కారును మెచ్చుకున్నట్లు గుర్తు చేశారు. నేషనల్ థర్మల్ ప్రాజెక్టు, రామగుండం ఎరువుల కర్మాగారం ఇచ్చామని తెలిపారు. తెలంగాణలోనే ఎక్కువ రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పంటలకు మద్దతు ధర విషయంలో మోదీ సర్కారు రైతులకు మేలు చేసినట్లు పేర్కొన్నారు. వరి సహా ఇతర పంటలకు మద్దతు ధరలు పెంచినట్లు వెల్లడించారు. యూపీఏలో కేసీఆర్ భాగస్వామిగా ఉండి మద్దతు ధర పెంచలేకపోయారని ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎరువుల ధరలు భారీగా పెరిగినా.. రైతులపై భారం పడకుండా సబ్సిడీ పెంచినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిలో దేశం నంబర్ వన్, చేపల ఉత్పత్తిలో రెండో స్థానం, వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
కాగా, ఇవాళ(మే 11) కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ పర్యటనకు రానున్నారు. నగరంలో అమిత్ షా బహిరంగ సభ సందర్బంగా నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో బందోబస్తుకు సంబంధించి అధికారులతో విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.సి.యం.త్రివిక్రమ వర్మ సమావేశం నిర్వహించారు. మొత్తం నలుగురు డిసిపీ లు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు, 04 స్పెషల్ పార్టీ లతో మొత్తంగా 950 సిబ్బంది, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బందో బస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించే ప్రాంతాలైన ఐ.ఎన్.ఎస్ డేగ, ఎయిర్ పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయనున్న పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్విక్షన్ సెంటర్ తో పాటూ ఆయన పర్యటించనున్న ప్రతీ ప్రాంతంలో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అధికారులను విశాఖ సీపీ ఆదేశించారు. వాస్తవానికి అమిత్ షా ఈనెల 8న విశాఖకు రావాల్సి ఉంది. కానీ వేరే కార్యక్రమాలు ఉన్నందున విశాఖ పర్యటనను ఈ ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. కాగా, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరుసటి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనతో ఏపీపై బీజేపీ పట్టుకోసం ఫోకస్ చేస్తోంది.