Men Saving Societies In Andhra Pradesh: డ్వాక్రా..స్వయం సహాయక మహిళా సంఘాలు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు పరిచయం చేయనక్కర్లేనంతగా  ప్రజల నోళ్లలో పాతుకుపోయింది. రెండు రాష్ట్రాల్లో  డ్వాక్రా(DWCRA) గ్రూప్‌ లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. నాటి  ముఖ్యమంత్రి  చంద్రబాబు మానసపుత్రికగా  ఉమ్మడి ఏపీలో అడుగుపెట్టి ప్రజల జీవితాలతో అంతగా పెనవేసుకుపోయింది.మహిళల  ఆర్థిక స్థితిగతులను  పూర్తిగా మార్చివేసిన డ్వాక్రా గ్రూప్‌లు ఇప్పుడు పురుషులతోనూ నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
ఫైలట్‌ ప్రాజెక్ట్‌
పురుషులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పొదుపు అనేది మహిళలు, పురుషులకు సంబంధించిన  వ్యవహారం కాదని... ఇంట్లో ఎవరు పొదుపు చేసినా..ఆ ఇల్లు బంగారంలా మారిపోతుందన్న నమ్మకంతో పురుషులతోనూ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది ప్రభుత్వం. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా  తొలుత విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vizag)లో 3వేల సంఘాలతో ప్రయోగత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారు.
 
పురుష పొదుపు సంఘాల ఏర్పాటుకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభమైంది. మహిళల కన్నా పురుషులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వెయ్యి సంఘాలు ఏర్పాటయ్యాయి. మార్చి నెలాఖరులోగా మరో 2వేల సంఘాలు సిద్ధం చేయనున్నారు. అసంఘటిత కార్మికుల ఆర్థిక,సామాజిక అబివృద్ధి కోసం వీటిని ఏర్పాటు చేయనున్నట్లు  ప్రభుత్వం తెలిపింది.
 
జాతీయ పట్టణ జీవనోపాదుల మిషన్‌(NULM) 2.0 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా  25 నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసేందుకు  కేంద్రం అనుమతిచ్చింది. గ్రామాల నుంచి నగరాలకు ఉపాధి కోసం తరలివస్తున్న కూలీలకు  ఆర్థికంగా భరోసా కల్పించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆర్థికంగా  ఆదుకోవడంతోపాటు సంఘాలు ఏర్పాటుతో ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటు చేయించనున్నారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా  చేయూతనందించనున్నారు.
 
అర్హతలు
 * తొలిదశలో భవన నిర్మాణ కూలీలు, కార్మికులతో  సంఘాలు ఏర్పాటు చేయనున్నారు.
* జొమాటో(Zomoto), స్విగ్గీ (Swiggy)వంటి ఆన్‌లైన్ పుడ్‌ డెలివరీ బాయ్స్‌, కూరగాయలు, నిత్యావసరాలు సరఫరా చేసే గిగ్ కార్మికులు
ఆటో రిక్షా, తోపుడు బండ్లపై అమ్ముకునే చిరువ్యాపారులు
* వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు,ఇళ్లలో పనిచేసుకునే వారు
* వీధుల్లో  చెత్త సేకరించే  కార్మికులు
 
 
రుణాలు మంజూరు
మహిళా పొదుపు సంఘాల్లో  కనీసం 10 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా...పురుషుల పొదుపు సంఘంలో గరిష్ఠంగా ఐదుగురు సభ్యులు ఉంటే సరిపోతుంది.
ప్రతి నెల సమావేశమై  ఒక్కో సభ్యుడు కనిష్ఠంగా  వంద రూపాయల చొప్పున పొదుపు చేయాలి. మూడు నెలలు తర్వాత పొదుపు చేసిన మొత్తంపై ఆరురెట్లు లేదా రూ.1.50లక్షల రుణాన్ని బ్యాంకులు ద్వారా అందిస్తారు. ఈ సొమ్మును వృత్తి, కుటుంబ అవసరాలు, ఉపాధి మెరుగుపరుచుకోవడానికి వినియోగించుకోవచ్చు. సభ్యులు సకాలంలో బ్యాంకు(Bank) రుణం చెల్లిస్తే మళ్లీ అదనపు రుణాలు పొందవచ్చు.
 
 
దశల వారీగా విస్తరణ..
ముందుగా  విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రయోగాత్మకంగా  పరిశీలించిన తర్వాత దశలవారీగా  ఇతర పట్టణాలకు విస్తరించనున్నారు. రెండోదశలో అనకాపల్లి,  కాకినాడ, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి,కర్నూలుజిల్లాలకు విస్తరించనున్నారు. త్వరలోనే సర్వే చేపట్టి ఆయా జిల్లాల్లో కార్మికులను గుర్తించనున్నారు.