Konidela Upasana Will Started New Project On Women And Child Welfare In Pithapuram: పిఠాపురం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీ మేరకు అక్కడ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టేందుకు ముందుకొచ్చారు. గొల్లప్రోలు - చోబ్రోలు మధ్య స్థలాన్ని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి, పలు సహాయ కార్యక్రమాలకు ముందుకొస్తున్నారు. తాజాగా, మెగా కోడలు కొణిదెల ఉపాసన (Konidela Upasana) సైతం చిన్న మామ పవన్ కల్యాణ్‌కు అండగా.. పిఠాపురంలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
తాత జన్మదినం సందర్భంగా..
అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉపాసన ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిఠాపురంలో సహాయక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళా, శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. గర్భిణిలు, శిశువుల్లో పోషకాహార లోపం నివారించేలా చూడనున్నట్లు పేర్కొన్నారు. తొలుత పిఠాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించి అనంతరం వివిధ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. 'ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహన కల్పిస్తాం.' అని ఉపాసన వివరించారు.
'మీ అందరి ఆశీర్వాదంతో ఆరోగ్య, సాధికారత తల్లులు, చిన్నారులను తయారు చేస్తాం' అని ఉపాసన తెలిపారు. వెయ్యి రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే, పిల్లల ఆరోగ్య భద్రత, మాతృ శిశు సంరక్షణ, విద్యా వికాసం వంటి అంశాల్లో అంగన్వాడీల పాత్ర చాలా కీలకమని.. ఈ క్రమంలో త్వరలోనే 109 అంగన్వాడీ కేంద్ర భవనాలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. 'సమాజానికి తిరిగి ఇచ్చే అవకాశం రావడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. వారి పిల్లలు సంపూర్ణ పోషణ పొందాలి. ఈ లక్ష్యంతోనే మా ప్రయాణం మొదలైంది.' అని అన్నారు. తొలుత పిఠాపురంలో ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ఉపాసన స్పష్టం చేశారు.