BJP Poaching in Delhi:
ఆప్ ఆరోపణలు..
ఆమ్‌ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఓటమి ఎదురైనా...ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల బీజేపీ పరిపాలనకు స్వస్తి పలికి అధికారంలోకి వచ్చింది ఆప్. బీజేపీని ఢీకొట్టి నిలబడగలం అని ధీమాగా చెబుతోంది ఆప్. అయితే...ఇదే సమయంలో బీజేపీని టార్గెట్ చేస్తోంది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్‌లను కొనేందుకు బీజేపీ మంతనాలు జరుపుతోందని ఆప్ ఆరోపిస్తోంది. మళ్లీ బీజేపీ తన "డర్టీ గేమ్స్" ని మొదలు పెట్టిందని విమర్శిస్తోంది. ఆప్ కౌన్సిలర్‌లు డాక్టర్ రోనాక్షి శర్మ, అరుణ్ నవారియా, జ్యోతి రాణి...ప్రెస్ మీట్ పెట్టి మరీ...బీజేపీపై ఇలా ఆరోపణలు చేశారు. మరో సీనియర్ నేత సంజయ్ సింగ్ కూడా బీజేపీ కుట్రలపై మాట్లాడారు. "80 చోట్ల దారుణంగా ఓటమి చవి చూసిన బీజేపీ ఇప్పుడు డర్టీ గేమ్స్ మొదలు పెట్టింది. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎలాగైతే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడిందో..అదే ఇక్కడా అమలు చేస్తోంది" అని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని మండి పడ్డారు. డబ్బు ఆశ చూపించి, కొందర్ని బెదిరించి తమ వైపు తిప్పుకునేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. "బీజేపీ ఎంతగా దిగజారిపోయిందంటే...మా కన్నా 30 సీట్లు తక్కువే వచ్చినా తమ పార్టీ అభ్యర్థే మేయర్‌గా ఉండాలని పట్టు పడుతోంది" అని అన్నారు సంజయ్ సింగ్. "బీజేపీ తరపున యోగేంద్ర చండోలియా అనే వ్యక్తి రోనాక్షి శర్మకు కాల్ చేశాడు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌తో మాట్లాడాలని కోరాడు. రూ.100 కోట్లతో కౌన్సిలర్‌లను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకోవాలని అడిగారు. 10 మంది కౌన్సిలర్‌ల కోసం రూ.100కోట్లు ఇస్తామని చెప్పాడు. అంటే ఒక్కోకౌన్సిలర్‌పై రూ.10 కోట్లు ఖర్చు పెట్టేందుకైనా వెనకాడలేదు" అని మండి పడ్డారు. "ఈ డీల్‌కు అంగీకరించకపోతే చంపేందుకైనా వెనకాడమని కొందరు బెదిరించారు" అని నవారియా వెల్లడించారు. క్రాస్ ఓటింగ్ చేసేందుకు రూ.50 లక్షలు ఇస్తామని బీజేపీ చెప్పినట్టు మరో లీడర్ ఆరోపించారు.
ఆప్ ఘన విజయం..
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మెజార్టీ మార్క్ 126ను దాటి 134 వార్డుల్లో కేజ్రీవాల్ పార్టీ గెలుపొందింది. మరోవైపు భాజపా 104 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాలను సాధించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ గెలుపుపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
" దిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనను కేజ్రీవాల్ కూకటివెళ్లతో పెకిలించారు. ఇప్పుడు ఎంసీడీలో భాజపా 15 ఏళ్ల పాలనకు తెరదించారు. విద్వేషపూరిత రాజకీయాలను దిల్లీ ప్రజలు కోరుకోవటం లేదని ఈ ఎన్నికలు చెబుతున్నాయి. వారు పాఠశాలలు,
ఆసుపత్రులు, విద్యుత్తు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశారు. "
- భగవంత్ మాన్, పంజాబ్ సీఎం
Also Read: Gujarat BJP: గుజరాత్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ, మరోసారి సీఎంగా భూపేంద్ర పటేల్