Gujarat BJP:


ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు..


గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఈ శనివారం గాంధీనగర్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా పాల్గొన్నారు. రెండో సారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా భూపేంద్ర భాయ్ పటేల్ ను ఎన్నుకోగా, ఆయన సోమవారం (12వ తేదీన) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ శుక్రవారం ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ రాజ్ భవన్ లో లేఖ సమర్పించిన భూపెంద్ర పటేల్ ను వరుసగా రెండవ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు.


వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా భూపేంద్ర


భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబరు 12 న జరగనున్నట్టు ప్రకటించింది బీజేపీ. ఆయనతో పాటు 12మందికి పైగా మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు సీఆర్ పటేల్ హాజరు కానున్నారు.


గుజరాత్ ఎన్నికల ఫలితాలు


గుజరాత్ ఎన్నికల్లో  వరుసగా ఏడవసారి భారతీయ జనతా పార్టీ 52.5 శాతం ఓట్లతో 156 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 27 శాతం ఓట్లతో  17 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 13శాతం ఓట్లతో 5 స్థానాలు  దక్కించుకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానం, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలలో విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 30 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. అక్కడక్కడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ...దాన్ని కూడా అధిగమించి భారీ విజయం దిశగా దూసుకుపోయింది. మోడీ, షా ద్వయం ఈ సారి కూడా మేజిక్ చేశారని బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, నీటి కొరత, జాతీయవాదంతో పాటు గుజరాతీ ఐడెంటిటీ అంశాలు...ఈసారి ఎన్నికలను ప్రభావితం చేశాయి. భాజపాను ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నాయి. ఆమ్ఆద్మీ  పార్టీ నమ్ముకున్న అస్త్రం ద్రవ్యోల్బణం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భాజపాను చుట్టుముట్టాలని చూశారు కేజ్రీవాల్.


అటు కాంగ్రెస్‌ కూడా ఇదే అంశాన్ని నమ్ముకుంది. అయితే...ఈ ప్రచారాన్ని భాజపా కొట్టి పారేసింది. పైగా..ఉజ్వల స్కీమ్‌లో భాగంగా లబ్ధిదారులందరికీ ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో "ద్రవ్యోల్బణం" అంశం మరుగున పడుతుందని బీజేపీ భావించింది. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే...ద్రవ్యోల్బణం అనే అంశం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపించలేదని అర్థమవుతోంది. దాదాపు 30ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఈసారి ఆ హోదాని కూడా కోల్పోయింది. గత ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా ఉన్న హస్తంపార్టీ ఈసారి కనిపించకుండా పోయింది. ఆప్‌, ఎంఐఎం పార్టీల ప్రభావం బీజేపీ కన్నా కాంగ్రెస్‌ కే తీవ్ర నష్టం కలిగించింది. దీనికి తోడు కాంగ్రెస్‌ పెద్దలు కూడా గుజరాత్‌ ఎన్నికలపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో ఈసారి ప్రతిపక్షహోదాని కూడా నిలుపుకోలేకపోయిందన్న టాక్‌ వినిపిస్తోంది.


Also Read: Bofors Scam: బోఫోర్స్‌ కుంభకోణాన్ని తిరిగి తోడుతున్న బీజేపీ, ట్వీట్‌లతో కాంగ్రెస్‌కు స్పాట్‌