బాసర ట్రిపుల్ ఐటీ యంత్రాంగంపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం తాను క్యాంపస్ కి వచ్చినప్పుడు చేసిన హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని అన్నారు. మంచి ఆహారం పెట్టడంలో పదే పదే ఎందుకు విఫలం అవుతున్నారని నిలదీశారు. తరచుగా ఫుడ్‌ పాయిజన్‌ జరగుతున్నా మెస్‌ కాంట్రాక్టర్‌ను ఎందుకు మార్చట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే పోలీసుల సాయం తీసుకోవాలని అధికారులకు సూచించారారు. 


శనివారం బాసర ట్రిపుల్ ఐటీలో ఐదో స్నాతకోత్సవం జరిగింది. ఇందులో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, షూస్ పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం రెడీగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. 


స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రసంగిస్తూ.. ‘‘ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంది. త్వరలోనే టి.హబ్ ప్రారంభిస్తాం. అనేక స్టార్టప్ లకు తెలంగాణ వేదికగా మారుతోంది. ప్రఖ్యాత సంస్థలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయి. నూతన ఆవిష్కరణలకు అవసరమైన తర్ఫీదు ఇస్తాం. మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంతవరకైనా పోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహా అనేక కోర్సులకు మంచి భవిష్యత్ ఉంది. ఈ కోర్సులను అర్జీయూకేటీ నుంచి ప్రారంభించాలని వీసీని ఆదేశించాను.’’


బాసర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. ‘‘మిషన్ భగీరథ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు నీరు అందిస్తాం. క్యాంపస్ విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున  మొత్తం సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. రూ.5 కోట్లతో సైన్స్ క్లబ్ ఏర్పాటు చేస్తాం. క్యాంపస్ లోని చెరువును సుందరీకరణ చేస్తాం. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత నాది. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. 10 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ప్రపంచంతో పోటీపడే సత్తా మీకు ఉంది. ఇంకా శానిటేషన్ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తాం. నాణ్యమైన భోజనం కూడా అందిస్తాం’’ అని కేటీఆర్ భరోసా కల్పించారు.