Fire Accident In Vizag Indus Hospital: విశాఖలోని ఇండస్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారి అలుముకున్న పొగ, మంటలతో ఆసుపత్రిలో ఉన్న రోగులు భయాందోళనలకు గురయ్యారు. అవకాశం ఉన్న వాళ్లు బయటకు పరుగులు తీశారు. కదల్లేని వాళ్లు మాత్రం అక్కడే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉండిపోయారు.


ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు ఏర్పాటు చేసిన ఆసుపత్రి యాజమాన్యం రోగులను తరలించారు. సమీపంలోని వేర్వేరు ఆసుపత్రులకు రోగులను షిప్ట్ చేశారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్‌లు అగ్ని కీలలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి.


ఆపరేషన్‌ థియేటర్‌లో జరిగిన ప్రమాదం కారణంగానే మంటలు ఎగసి పడ్డాయి. ఆ మంటలు ఒక్కసారిగా ఆసుపత్రి మొత్తం వ్యాపించాయి. క్షణాల్లోనే అగ్ని కీలలు అంటుకున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రోగుల హాహాకారాలతో ఆసుపత్రి నిండిపోయింది. ఎవరు ఎటు పరుగెడుతున్నారో అర్థం కాలేదు.