మావోయిస్టు పార్టీ నుండి సీనియర్ సభ్యుడు కోబాడ్ గాంధీని బహిష్కరిస్తున్నట్లుగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించామని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.  మార్క్సిజం-లెనినిజం-మావోయిజం మూల సూత్రాలను తిరగదోడడం, పాలకవర్గాలకు అనుకూలంగా మారి మావోయిస్టు పార్టీపై బుదరజల్లడం, మూలసూత్రమైన వర్గపోరాటానికి బదులుగా వర్గ సామరస్య భావనలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని భావవాద ఆధ్యాత్మిక గురువుగా మారడం వల్ల బహిష్కరిస్తున్నట్లుగా అభయ్ తెలిపారు. 


Also Read : బాంబు ప్రమాదంలో మావోయిస్టు రవి మృతి... ఏడాదిన్నర తర్వాత ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ


మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన కోబాడ్ గాంధీ ప్రస్తుతం ఉద్యమంలో లేరు. ఆయన 2009లో క్యాన్సర్ కు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉండగా ఢిల్లీలో అరెస్టయ్యారు. ఆయనపై అనేక కేసులు ఉండటంతో దాదాపుగా పదేళ్లకుపైగా జైల్లో ఉన్నారు. 2019లో జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని ధనవంతులైన  విద్యావంతుల కుటుంబంలో పుట్టిన కోబాడ్ గాంధీ నక్సలిజంవైపు ఆకర్షితులై సుదీర్ఘ కాలం ఉద్యమంలో పనిచేశారు.  1970 తొలి నాళ్లలో అతను నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లారు. అతను డూన్ స్కూల్లో చదువుకున్నారు.


Also Read : ఏడు రోజుల తర్వాత ఇంజనీర్‌ను విడుదల చేసిన మావోయిస్టులు


మావోయిస్టుల ప్రచార విభాగం ఇంచార్జీగా ఉన్న సమయంలో ఆయన అరెస్టయ్యారు. ఆయనకు సహాయంగా ఉంటున్న ఓ మావోయిస్టు నమ్మకద్రోహం చేయడం వల్ల దొరికిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఎక్కువ కాలం ఉన్నారు. ఈ క్రమంలో జైలు లో ఉన్న సమయంలో.. విడుదలైన తరవాత ఆయన మారిపోయారు.  ఇటీవల  " ఫ్రాక్చర్డ్ ఫ్రీడమ్ ఏ ప్రిజన్ మెమొయిర్" అనే పుస్తకం రాశారు. అందులో ఇప్పుడు మావోయిస్టు సిద్ధాంతాలకు భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.


Also Read : ఆర్కే స్థానంలో సుధాకర్ ? ఏవోబీలో పట్టు జారకుండా మావోయిస్టుల పక్కా వ్యూహం !


పుస్తకంలో మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు లేదని, రోవింగ్ రెబల్స్ గా పనిచేస్తున్నట్లు నిందారోపణలు చేశారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మావోయిస్టులకు సహకరించడానికి ఆయన నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అభయ్ తన లేఖలో పరోక్షంగా చెప్పారు. వర్గపోరాటంలో, ప్రజాయుద్ధంలో స్వయంగా పాల్గొని నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా స్వీయాత్మక ఆలోచనలు, భావాలను సరదిద్దుకోడానికి అవకాశం ఉన్నా దాన్ని తిరస్కరించారని బహిష్కరణ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. 


Also Read : అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి