Manish Sisodia:
2024 ఎన్నికల్లో భాజపా వర్సెస్ ఆప్..
ఢిల్లీ డిప్యుటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించటం అక్కడి రాజకీయాల్ని వేడెక్కించింది. ఈ విషయమై భాజపా, ఆప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదంతా కేంద్రం కుట్ర అని సీఎం కేజ్రీవాల్, డిప్యుటీ సీఎం సిసోడియా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలోనే సిసోడియా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర హెల్త్‌మినిస్టర్ సత్యేందర్ జైన్‌ను జైల్లో పెట్టిందని, తననూ రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో తాను చేసిన అభివృద్ధిని భరించలేకే ఇలా కక్ష తీర్చుకుంటు న్నారని ఆరోపించారు. 2024 ఎన్నికలు..భాజపా వర్సెస్ ఆప్, పీఎం మోదీ వర్సెస్ సీఎం కేజ్రీవాల్ మధ్య యుద్ధంలా మారనున్నాయని తేల్చి చెప్పారు. "బహుశా మూడు, నాలుగు రోజుల్లో నన్నుఅరెస్ట్ చేస్తుండొచ్చు. సీబీఐ నన్ను అరెస్ట్ చేసినా నేను భయపడను. మా సంకల్పాన్ని ఎవరూ ఏమీ చేయలేరు" అని స్పష్టం చేశారు సిసోడియా. "భాజపా సమస్య అంతా కేజ్రీవాల్‌తోనే. నా ఇంటిపైనా సీబీఐతో సోదాలు చేయించింది.. కేవలం కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకే. నేను ఎలాంటి అవినీతికీ పాల్పడలేదు" అని వెల్లడించారు. ఏ ఎక్సైజ్ పాలసీ విషయంలో కేంద్రం తమను ఇబ్బంది పెడుతోందో...అది దేశంలోనే బెస్ట్ పాలసీ అని అన్నారు సిసోడియా.
ఆ ఆర్టికల్‌పైనా దుమారం..
సీబీఐ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదని, వాళ్లు కేవలం అధిష్ఠానం ఆర్డర్లను తుచ తప్పకుండా పాటిస్తున్నారని చెప్పారు. అగౌరవపరచకుండా సోదాలు నిర్వహిస్తున్నందుకు సీబీఐ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుండటంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రపంచమంతా దిల్లీ ఎడ్యుకేషన్ మోడల్, హెల్త్ మోడల్ గురించి మాట్లాడుకుంటోందని ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన న్యూస్ పేపర్ న్యూయార్క్ టైమ్స్‌లో ఫ్రంట్ పేజ్‌లో ఢిల్లీ స్కూల్‌తో పాటు సిసోడియా ఫోటోతో ఉన్న ఆర్టికల్ వచ్చింది. "Our Children are worth it" అనే టైటిల్‌తో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేసిన కేజ్రీవాల్ "అమెరికాకు చెందిన అతి పెద్ద న్యూస్‌పేపర్ న్యూయార్క్‌టైమ్స్ ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసించింది. సిసోడియా ఫోటో కూడా వేసింది. ఇదే రోజున కేంద్రం ఆయన ఇంటికి సీబీఐని పంపింది. సీబీఐకి స్వాగతం. మేము వారికి సహకరిస్తాం. గతం లోనూ ఇలాంటి సోదాలు జరిగాయి. మేం తప్పు చేశామని అప్పుడు రుజువు కాలేదు. ఇకపైనా కూడా ఇంతే" అని ట్వీట్ చేశారు సీఎం కేజ్రీవాల్. అయితే...ఇది పెయిడ్ ఆర్టికల్ అంటూ భాజపా కౌంటర్ ఇచ్చింది. దీనిపై..ఆప్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక న్యూయార్క్ టైమ్స్ కూడా దీనిపై స్పందించింది. ఈ న్యూస్ పేపర్ ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ నికోల్ టైలర్ "ఇది పూర్తిగానిష్పక్షపాతమైన ఆర్టికల్" అని తేల్చి చెప్పారు.
Also Read: అక్కడ మహిళలకే బెడ్ పార్ట్‌నర్స్ ఎక్కువ, షాకింగ్ నిజాలు చెప్పిన సర్వే