మంగ‌ళ‌గిరి టీడీపీలో కీల‌క నేత‌గా ఉన్న గంజి చిరంజీవి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏకంగా సీఎం స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. సీఎం జ‌గ‌న్ స్వయంగా పార్టీ కండువా క‌ప్పి మ‌రీ చిరంజీవిని వైసీపీలోకి ఆహ్వానించారు. సీఎం జ‌గ‌న్ చిరంజీవిని ఆలింగ‌నం చేసుకొని మ‌రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో మంగ‌ళ‌గిరి వైసీపీలో ఏం జ‌రుగుతుంద‌నేది ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. 


ప‌క్కా ప్లాన్ ప్రకార‌మే 


గంజి చిరంజీవి వైసీపీలో జాయిన్ కావ‌టంపై స్థానికంగా అంత‌గా రియాక్షన్ రావ‌టం లేదు. ఎందుకంటే ఇది అంతా ఊహించిందే క‌దా అంటూ స్థానిక టీడీపీ, వైసీపీ నాయ‌కులు అంటున్నారు. గంజి చిరంజీవి 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన త‌రువాత చాలా ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పుడే ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌నుకున్నారు. కానీ చిరంజీవి ఓట‌మి పాలైనా, పార్టీ అధికారంలోకి రావ‌టంతో అప్పుడు అది సాధ్యం కాలేదు. ఆ త‌రువాత కూడా అనేకసార్లు చిరంజీవి పార్టీని వీడేందుకు ప్రయ‌త్నించారు. టీడీపీలో త‌న‌కు ప్రాధాన్యత లేదని ఆయన భావించారని తెలుస్తోంది.


మంగ‌ళ‌గిరి నుంచి 2019 ఎన్నికల్లో త‌న‌కు ల‌భించాల్సిన సీటును లోకేశ్‌కు కేటాయించారని చిరంజీవి అసహనంతో ఉన్నారని సమాచారం. అప్పుడు చిరంజీవి అల‌క చెంద‌టంతో పార్టీ అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్సీ ఇస్తామ‌ని టీడీపీ అగ్ర నాయ‌కులు ఆయ‌న్ని స‌ముదాయించారు. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ఏమో కానీ పార్టీలో చిరంజీవి తీవ్ర అసంతృప్తితోనే కాలం గ‌డుపుతూ వచ్చారు. చివ‌ర‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా ద‌క్కలేదు. దీంతో చిరంజీవి పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారు. అనుకున్నట్లుగానే పార్టీకి రాజీనామా చేసి, సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆయ‌న వైసీపీలో చేరారు.  


వాట్ నెక్ట్స్ 


టీడీపీలో అసెంబ్లీ సీటు ద‌క్కలేద‌నే అసంతృప్తితో ఉన్న చిరంజీవి పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడో ఆయ‌న రాజీనామా చేయాల్సి ఉన్నా, పార్టీ నాయ‌కులు ఎప్పటిక‌ప్పుడు సంప్రదింపులు జ‌రుపుతుండ‌టంతో, పార్టీలో అలానే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల సీజ‌న్ ఏపీలో రెండేళ్లు ముందుగానే హీట్ పెర‌గ‌టంతో, చిరంజీవి ఇప్పటికే లేట్ చేశామ‌ని భావించి పార్టీ మారార‌ని చెబుత‌ున్నారు. ప‌ద్మశాలి సామాజిక వ‌ర్గానికి చెందిన గంజి చిరంజీవికి వైసీపీ మంగ‌ళ‌గిరి సీట్ కేటాయిస్తుందనే ప్రచారం ఉంది. టీడీపీ నుంచి పోటీలో ఉన్న లోకేశ్‌ను ఓడించేందుకు అన్ని ప్రయ‌త్నాలు చేస్తున్న వైసీపీ, చిరంజీవినే అస్త్రంగా వినియోగించ‌బోతోంద‌నే ప్రచారం ఉంది. మ‌రి ఈ ప‌రిణామాలు ఎలాంటి మార్పుల‌కు కేంద్రం అవుతుంద‌నేది వేచి చూడాలంటున్నారు పార్టీ వ‌ర్గాలు.  


కీల‌కంగా వ్యవ‌హ‌రించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే


టీడీపీ నుంచి గంజి చిరంజీవిని వైసీపీలోకి తీసుకురావ‌టంలో ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. ఆయ‌న‌తోపాటు ఎమ్మెల్సీ మురుగుడు హ‌నుమంత‌రావు కూడా చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో గంజి చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే స‌మ‌యంలో ప‌ద్మశాలి సామాజిక వ‌ర్గం కీల‌కంగా భావించి చిరంజీవికి పెద్దపీట వేసిన‌ట్లుగా భావిస్తున్నారు. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై 2014లో గంజి చిరంజీవి పోటీ చేసిన స‌మ‌యంలో కేవ‌లం 12 ఓట్ల మెజార్టీతో ఆళ్ల విజ‌యం సాధించారు. అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు వైసీపీలో సస్పెన్ష్‌గా మారింది. 


Also Read : వినాయక చవితిలో రాజకీయాల జోక్యం, ఏం జరగుతుంది?


Also Read : సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం జగన్ తరఫున బుగ్గన