Kolkata News Updates: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని నినదించారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్‌పై దాడి జరిగిన ఘటనలో హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఆ తరవాత కొద్ది గంటలకే మమతా ర్యాలీ చేశారు. హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్ హాస్పిటల్‌ వద్దే ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు నిజం బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. అంతే కాదు. హాస్పిటల్‌పై దాడి చేసింది కచ్చితంగా బీజేపీయేని ఆరోపించారు. బీజేపీతో పాటు వామపక్ష పార్టీలూ ఇందుకు సహకరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో మమతా బెనర్జీతో పాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. "ఉరిశిక్ష వేయాల్సిందే" అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్రజలు ఈ స్థాయిలో ఆందోళనలు చేయడాన్ని సమర్థించారు మమతా. వాళ్లు చేసింది సరైందే అని అన్నారు. సీబీఐకి అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే విచారణ జరిపించి నిందితుడికి ఉరిశిక్ష విధించేలా చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. 






"హాస్పిటల్‌పై దాడి చేసింది బీజేపీ, వామపక్ష పార్టీలే అని నాకు తెలుసు. అక్కడ ఆ పార్టీల జెండాలు కూడా కనిపించాయి. నా దగ్గర వీడియోలున్నాయి. జాతీయ జెండాని కూడా వాళ్లు దుర్వినియోగం చేశారు. కచ్చితంగా ఆ పార్టీ వాళ్లను శిక్షించాలి. మణిపూర్‌లో అంత విధ్వంసం జరిగింతే ఈ పార్టీలు ఎన్ని టీమ్స్‌ని పంపాయి..? నన్ను ఇలా బెదిరించడం సరికాదు. మమ్మల్ని ప్రజలే ఎన్నుకున్నారన్న విషయం గుర్తుంచుకోండి"


- మమతా బెనర్జీ, బెంగాల్ ముఖ్యమంత్రి


ర్యాలీ అందుకేనట..


మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసుని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తున్నాయి. సాక్ష్యాధారాలనూ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని మండి పడుతున్నాయి. హాస్పిటల్ దాడి వెనక బీజేపీ హస్తం ఉందని మమతా ఆరోపించినప్పటి నుంచి రాజకీయంగా దుమారం రేగుతోంది. ఆ వెంటనే మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించారు. సీబీఐ రోజూ ఈ కేసు గురించి అప్‌డేట్స్ ఇవ్వాలని, ఆగస్టు 17వ తేదీ నాటికి ఈ కేసుపై పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేశారు. 


Also Read: J&K Assembly Elections 2024: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఆర్టికల్ 370 రద్దు తరవాత తొలిసారి ఎలక్షన్స్