J&K Assembly Elections 2024 Schedule: కేంద్ర ఎన్నికల సంఘం జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో పోలింగ్ జరగనుందని ఈసీ వెల్లడించింది. మొదటి ఫేజ్ ఎన్నికలు సెప్టెంబర్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇక రెండో విడత సెప్టెంబర్ 25న, మూడో విడత ఎన్నికలు అక్టోబర్ 1న (J&K Assembly Elections 2024 Schedule) జరగనున్నాయి. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఈసీ ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. ఇన్నాళ్లకు అక్కడ పూర్తిస్థాయిలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం ఏర్పాటు కానుంది.


మొత్తం 90 నియోజకవర్గాలున్న జమ్ముకశ్మీర్‌లో 87.09 లక్షల మంది ఓటర్లున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. వీళ్లలో 44.46 లక్షల మంది పురుషులు, 42.62 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. ఆగస్టు 19వ తేదీన అమర్‌నాథ్ యాత్ర ముగుస్తుందని, ఆగస్టు 20వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రజలు జమ్ముకశ్మీర్‌లో మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈసీ ఎన్నికల తేదీలు ప్రకటించింది. 


"ఈ మధ్యే జమ్ముకశ్మీర్‌లో పర్యటించాం. అక్కడ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం. అక్కడి ప్రజలు ఎన్నికల ప్రక్రియ పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకున్నారు"


- రాజీవ్ కుమార్, సీఈసీ 


ఎన్నికల తేదీలు ప్రకటించే కొద్ది గంటల ముందు జమ్ముకశ్మీర్‌లోని అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా అధికారులతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్‌లను బదిలీ చేశారు. పోలీస్ ఇంటిలిజెన్స్ యూనిట్‌లోనూ మార్పులు జరిగాయి. ఈ మార్పులపై నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పటికిప్పుడు ఎందుకు మార్చారని ప్రశ్నించింది. 


 






హరియాణా ఎన్నికల తేదీలనూ ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 4న ఫలితాలు విడుదల చేయనుంది. హరియాణా అసెంబ్లీ గడువు నవంబర్ 26వ తేదీతో ముగియనుంది. హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 73 జనరల్ కాగా మిగతా 17 SC నియోజకవర్గాలు. సెప్టెంబర్ 5వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. సెప్టెంబర్ 12తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిపోతుంది. 






Also Read: National Film Awards 2024: కార్తికేయ - 2 చిత్రానికి జాతీయ అవార్డు, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి - నేషనల్ అవార్డుల మొత్తం లిస్ట్ ఇదే