Mallikarjun Kharge:


రాజ్యాంగాన్ని కాపాడతా: ఖర్గే 


మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని AICC కార్యాలయంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. సోనియా గాంధీ అధికారికంగా తన బాధ్యతలను ఖర్గేకు అప్పగించారు. ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్తుందని ఆకాంక్షించారు. ప్రమాణస్వీకారం చేశాక ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ క్షణం నేనెంతో భావోద్వేగానికి గురవుతున్నాను. ఓ సాధారణ కార్మికుడి కొడుకుని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడటం నా ప్రధాన బాధ్యత" అని స్పష్టం చేశారు ఖర్గే. అంతే కాదు. రాజకీయాల్లో "త్యాగం" గురించి మాట్లాడాలంటే ముందుగా సోనియా గాంధీ గురించే చెప్పాలని అన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ఎంతో పురోగతి సాధించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్టీకి గడ్డుకాలం నడుస్తోందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మార్పులు తెచ్చేందుకు శ్రమిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచిందని, విద్వేషాలు, అబద్ధాలు, మోసాలను ఛేదించి తీరతామని స్పష్టం చేశారు. 137 ఏళ్లుగా కాంగ్రెస్ చరిత్ర ప్రజలతోనే ముడి పడి ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రమిస్తున్న రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. తనకు రాహుల్ మద్దతు ఎప్పుడూ ఉండాలని కోరుతున్నట్టు చెప్పారు. పార్టీలో యువతకు ప్రాధాన్యతనివ్వడంపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. ఉదయ్‌పూర్ క్యాంప్‌లో 50%పైగా యువతకే అవకాశమిచ్చినట్టు గుర్తు చేశారు. 


సోనియా ఏమన్నారంటే..? 


ఖర్గే ప్రమాణ స్వీకారం చేశాక సోనియా గాంధీ ప్రసంగించారు. ఖర్గేకి అభినందనలు తెలిపారు. "ఖర్గేకు అభినందనలు. ఇవాళ్టితో నా భారం దిగిపోయింది. ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఇది పార్టీ మొత్తానికి స్ఫూర్తినిస్తుంది. పార్టీని బలోపేతమూ చేస్తుంది. "పార్టీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. అటు దేశంలోనూ ఎన్నో సంక్షోభాలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తాం. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తారు. ఐకమత్యంగా సమస్యల్ని ఎదుర్కొంటారు. మా పార్టీ ఎప్పుడూ ఓటమిని అంగీకరించదు. ఒక్కటిగా నిలబడి ముందుకెళ్తాం" అని స్పష్టం చేశారు సోనియా గాంధీ. 


అంచెలంచెలుగా ఎదిగిన ఖర్గే..


అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 12 సార్లు బరిలోకి దిగిన ఖర్గే...కేవలం ఒకేఒకసారి ఓటమి చవి చూశారు. అది కూడా 2019లో. 2004లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి...వరుసగా ఎనిమిదో సారి అసెంబ్లీలోకి అడుగు పెట్టి నేతగా రికార్డు సృష్టించారు. కర్ణాటకలోని చిట్టపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 9 సార్లు విజయం సాధించారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఎదిగారు. 80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో దళితుడి గానూ ఘనత సాధించారు. జగ్జజీవన్‌ రామ్‌ తొలిసారి ఈ పదవిని చేపట్టారు. 1942లో జులై 21న బీదర్‌లో జన్మించారు ఖర్గే. గుల్బర్గాలోని Seth Shankarlal Lahoti Collegeలో లా చదివారు. ఎన్నో లేబర్ యూనియన్ కేసులూ గెలిచారు. ఆ తరవాత ఆయనే..లేబర్ యూనియన్ లీడర్‌గా ఎదిగారు. 1969లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1972లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1973లో Octroi Abolition Committeeకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 


Also Read: Hijab Ban Controversy: హిజాబ్ ధరించిన మహిళ భారత్‌కు ప్రధాని కావాలి - అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్