Hijab Ban Controversy:


ఒవైసీ వ్యాఖ్యలు..


భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అవడంపై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్‌ను ఏలేది "మనోడే" అని సోషల్ మీడియాలోనూ తెగ పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే..అటు రాజకీయ నేతలూ దీనిపై స్పందిస్తున్నారు. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. "హిజాబ్ ధరించిన మహిళ భారత్‌కు ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు ఒవైసీ. కర్ణాటకలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది AIMIM పార్టీ. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయపురకు వెళ్లారు అసదుద్దీన్. ఆ సమయంలోనే మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. లిజ్‌ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంలో విఫలమైనందునే
ఆమెను ఆ పదవి నుంచి తప్పించారని చెప్పారు. "ప్రజాస్వామ్య బద్ధంగా ఆ దేశంలో ప్రధానిని మార్చేశారు. అది వాళ్ల నిర్ణయం. కానీ...హిజాబ్‌ ధరించడంపై మన దగ్గర నిషేధం అమలవుతోంది. నేనొకటే చెబుతున్నాను. నేను బతికున్నప్పుడో లేదంటే నా తరవాతైనా సరే హిజాబ్ ధరించిన మహిళ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నాను" అని వెల్లడించారు. యూకేలో తొలిసారి ఓ నాన్ క్రిస్టియన్‌ ప్రధాని అవడంపై ఈ విధంగా స్పందించారు అసదుద్దీన్. అయితే...అసదుద్దీన్ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండి పడుతున్నారు. "ఒకవేళ అసదుద్దీన్ ఒవైసీకి అభివృద్ధి పట్ల అంత నిబద్ధత ఉండి ఉంటే...హైదరాబాద్‌లో పాతబస్తీ వరకూ మెట్రో రైల్ ఎక్స్‌టెండ్ అవుతుందని హామీ ఇవ్వాలి. ఇరాన్‌ లాంటి దేశాల్లో హిజాబ్‌పై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే...వాటిపై మాత్రం ఒవైసీ ఎందుకు మాట్లాడరు..?" అని భాజపా ప్రతినిధి ఎన్‌వీ సుభాష్  విమర్శించారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమని, ఆ విధానానికి కట్టుబడి ఉన్న వాళ్లెవరైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారని స్పష్టం చేశారు. "ఎస్‌సీ వర్గానికి చెందిన ఓ మహిళ భారత రాష్ట్రపతి అవుతారని ఎవరైనా ఊహించారా" అని అన్నారు. 


కాంగ్రెస్‌ వర్సెస్ భాజపా


మైనార్టీ వర్గానికి చెందిన వాళ్లు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగటం సాధ్యమేనా అన్న ప్రశ్నకు రిషి సునాక్ సమాధానం చెప్పారని కొందరు అంటుంటే...అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంకొందరు నేతలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ దీనిపై స్పందించారు. "బ్రిటన్‌లో ఇది సాధ్యమైందంటే మనం దృష్టి సారించాల్సిన సమయం వచ్చినట్టే. అక్కడ జరిగిన ఈ మార్పునకు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. ఓ మైనార్టీకి అత్యున్నత పదవి దక్కింది. ఈ విజయాన్ని మనమంతా ఆస్వాదిస్తే సరిపోదు. భారత్‌లోనూ ఇది సాధ్యమవుతుందా అని కచ్చితంగా ప్రశ్నించాలి" అని అన్నారు థరూర్. మరో కాంగ్రెస్ నేత చిదంబరం కూడా ఇదే తరహాలో స్పందించారు. "యూకేలో రిషి సునాక్, అమెరికాలో కమలా హేరిస్. అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీన్నుంచి మనం పాఠం నేర్చుకోవాలి" అని ట్వీట్ చేశారు. ఈ విమర్శలపై భాజపా కౌంటర్ ఇచ్చింది. "ఏపీజే అబ్దుల్ కలామ్, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లు అత్యున్నత పదవిని అలంకరించారు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓ గిరిజన వర్గానికి చెందిన వాళ్లు. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌కు ప్రధాని అయితే మెచ్చుకోవాలి. కానీ...దీనిపైనా కొందరు నేతలు రాజకీయం చేస్తున్నారు" అంటూ భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.