Make India No 1 Campaign: 


మేక్ ఇండియా నంబర్ వన్..


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మేక్ ఇండియా నంబర్ 1 (Make India No1) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను వెల్లడించారు. "ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్ ఇచ్చి భారత్‌ నంబర్ వన్ అయ్యేందుకు సహకరించండి" అని పిలుపునిచ్చారు. "ఈ మిషన్‌లో పాల్గొనాలని అనుకునే వాళ్లు 9510001000 నంబర్‌కి మిస్డ్‌ కాల్ ఇవ్వండి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్‌ను మార్చేందుకు సహకరించండి" అని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 17న ఈ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు చెప్పారు. సుపరిపాలనే లక్ష్యంగా 5 అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకోసం ప్రపంచ దేశాలు పర్యటించి
మద్దతు కూడగడతానని వెల్లడించారు. దీన్ని ఓ "నేషనల్ మిషన్" అని చెబుతున్నారు కేజ్రీవాల్. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలవాలన్న భారత్‌ కలను నెరవేర్చుకునేందుకు అందరం ఈ మిషన్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. "మరోసారి మన భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలి" అని ఆకాంక్షించారు. "స్వాతంత్య్రం సాధించుకుని 75 ఏళ్లైంది. ఈ 75 సంవత్సరాల్లో భారత్ ఎంతో సాధించింది. కానీ..మన తరవాత స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు మన కన్నా ముందున్నాయి. దీనిపైనే ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. మనమెందుకు వెనకబడాలి..? ప్రతి పౌరుడూ ఇదే ప్రశ్నిస్తున్నాడు" అని అన్నారు. 


ఢిల్లీలో సీబీఐ సోదాల కలకలం..


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుండటంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రపంచమంతా దిల్లీ ఎడ్యుకేషన్ మోడల్, హెల్త్ మోడల్ గురించి మాట్లాడుకుంటోందని ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన న్యూస్ పేపర్ న్యూయార్క్ టైమ్స్‌లో ఫ్రంట్‌ పేజ్‌లో ఢిల్లీ స్కూల్‌తో పాటు సిసోడియా ఫోటోతో ఉన్న ఆర్టికల్‌ వచ్చింది. "Our Children are worth it" అనే టైటిల్‌తో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేసిన కేజ్రీవాల్ "అమెరికాకు చెందిన అతి పెద్ద న్యూస్‌పేపర్ న్యూయార్క్‌టైమ్స్‌ ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసించింది. సిసోడియా ఫోటో కూడా వేసింది. ఇదే రోజున కేంద్రం ఆయన ఇంటికి సీబీఐని పంపింది. సీబీఐకి స్వాగతం. మేము వారికి సహకరిస్తాం. గతంలోనూ ఇలాంటి సోదాలు జరిగాయి. మేం తప్పు చేశామని అప్పుడు రుజువు కాలేదు. 
ఇకపైనా కూడా ఇంతే" అని ట్వీట్‌ చేశారు సీఎం కేజ్రీవాల్. ప్రపంచమంతా ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ గురించి మాట్లాడుకోవటాన్ని, భాజపా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని విమర్శించారు. "ఈ 75 ఏళ్లలో మన దేశానికి మంచి చేసిన వాళ్లు ఇలాంటి సవాళ్లే ఎదుర్కొన్నారు. అందుకే భారత్ ఇలా వెనకబడిపోయింది. కానీ దిల్లీకి మంచి చేయాలన్న మా ఆలోచనను పక్కన పెట్టేదే లేదు" అని కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. అటు సిసోడియా కూడా ట్విటర్ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. "మంచి పని చేసే వాళ్లకు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు" అని ట్వీట్ చేశారు. 


Also Read: Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ