Paytms CEO Vijay Shekhar Sharma: పేటీఎం స్థాపకుడు, సీఈవో విజయ శేఖర శర్మ అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. సంస్థ సీఈవోగా కొనసాగేందుకు ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొంటారో లేదో నేటితో తేలిపోనుంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగే ఓటింగ్‌లో మదుపర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.


దేశంలోని అతిపెద్ద ఐపీవోల్లో ఒకటిగా పేటీఎం స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. లక్ష కోట్లకు పైగా విలువతో అరంగేట్రం చేసింది. కానీ ఇది మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. తొలి రోజు నుంచే నష్టాల బాట పట్టింది. షేరు ధర రూ.2150 నుంచి రూ.600 స్థాయికి పతనమైంది. కంపెనీ వరుస త్రైమాసికాల్లో నష్టాలనే నమోదు చేస్తోంది. అలాంటప్పుడు లాభాల్లోకి తీసుకురాని సీఈవో ఎందుకని ఇన్వెస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


శుక్రవారం మధ్యాహ్నం పేటీఎం వార్షిక సాధారణ సమావేశం వర్చువల్‌గా జరుగుతోంది. అనేక అంశాలపై ఓటింగ్‌ నిర్వహించబోతున్నారు. సీఈవోగా విజయ్ శేఖర్‌ శర్మ పాత్రపై ఓటింగ్‌ ఉండనుంది. ఇన్వెస్టర్లు తిరిగి ఆయన్నే సీఈవోగా ఎన్నుకోవాలని ఓ ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గత వారం సూచించింది. పేటీఎంను నష్టాల్లోంచి లాభాల్లోకి తీసుకురాగల సత్తా ఆయనకే ఉందని చెబుతోంది. మరోవైపు ఆయనపై వ్యతిరేకత అంతకంతకూ తీవ్రమవుతోంది.


గతేడాది నవంబర్లో పేటీఎం స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి షేరు విలువ ఏకంగా 60 శాతం మేర పడిపోయింది. దాంతో ఇన్వెస్టర్లు లబోదిబో అంటున్నారు. అయితే భారత్‌లో వంద బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయం పొందే తొలి ఇంటర్నెట్‌ కంపెనీగా అవతరించేందుకు పేటీఎం సిద్ధంగా ఉందని విజయ శేఖర శర్మ చెబుతున్నారు. లాభాల వైపు మళ్లేలా  కంపెనీ వృద్ధి కొనసాగుతోందని హామీ ఇస్తున్నారు.


విజయ శేఖర్‌ ఈ మధ్యే కంపెనీ సీఈవోగా తిరిగి ఎంపికయ్యారు. ఆయన నియామకానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ప్రొఫెషనల్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని ఇన్‌స్టిట్యూషనల్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ గత వారం సూచించింది. కంపెనీ లాభాల బాటలో పయనించబోతోందని ఐపీవోకు ముందు విజయ శేఖర్‌ ఎన్నోసార్లు చెప్పినా ఇప్పటి వరకు అలా జరగలేదు. కాగా పేటీఎం షేరు ధర శుక్రవారం నష్టాల్లో ఉంది. రూ.12 నష్టంతో రూ.774 వద్ద కొనసాగుతోంది.