Love Jihad Cases:


మహారాష్ట్రలో..


లవ్ జీహాద్‌పై పదేపదే బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కొందరు ముస్లిం యువకులు హిందూ యువతులను టార్గెట్ చేసి ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, చంపుతున్నారంటూ చాన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర మంత్రి అసెంబ్లీలోనే లవ్ జీహాద్‌పై వ్యాఖ్యలు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ  మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా రాష్ట్రంలో ఇప్పటి వరకూ లక్షకుపైగా లవ్ జీహాద్ కేసులు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. చాలా జిల్లాల్లో ఈ కేసులకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఆందోళనలు చేపట్టారని చెప్పారు. శ్రద్ధ వాకర్‌ తరహాలో మరే యువతి కూడా హత్యకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఇలాంటి హత్యలను అరికట్టేందుకే Inter-Faith Marriage Committee ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు మంగళ్ ప్రభాత్. గతేడాది డిసెంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వారి వివరాలన్నీ సేకరించడమే ఈ కమిటీ పని. ఎన్ని పెళ్లిళ్లు జరిగాయి..? ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు..? వాళ్ల మతాలేంటి..? అనే సమాచారమంతా సేకరించి దాని ఆధారంగా నిఘా పెడతారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే దీనిపై గవర్నమెంట్ రిజల్యూషన్ కూడా జారీ చేసింది. జనవరి నుంచి ఇప్పటి వరకూ 152 కేసులను గుర్తించిన కమిటీ...ప్రభుత్వానికి ఆ లెక్కలు వెల్లడించింది. దీనిపై స్పందించిన మంత్రి మంగళ్ ప్రభాత్...ఎంతో మంది తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి తమ కూతుళ్ల గురించి ఆందోళన చెందారని చెప్పారు. కనీసం మాట్లాడేందుకూ వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. కౌన్సిలింగ్ ద్వారా మళ్లీ వాళ్లను తల్లిదండ్రులతో కలుపుతామని వివరించారు.