వెబ్ సిరీస్ రివ్యూ : యాంగర్ టేల్స్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, వెంకటేష్ మహా, బిందు మాధవి, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య తదితరులు
రచన : కార్తికేయ కారెడ్ల, నితిన్ ప్రభల తిలక్
ఛాయాగ్రహణం : అమర్ దీప్, వినోద్ కె బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజే ఆరోన్
సంగీతం : స్మరణ్ సాయి
దర్శకత్వం : నితిన్ ప్రభల తిలక్
నిర్మాతలు : శ్రీధర్ రెడ్డి, సుహాస్
విడుదల తేదీ: మార్చి 9, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్


'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్' సినిమాలతో సుహాస్ (Suhas Actor) హీరోగా విజయాలు అందుకున్నారు. 'యాంగర్ టేల్స్' వెబ్ సిరీస్ (Anger Tales Web Series)తో ఆయన నిర్మాతగా మారారు. శ్రీధర్ రెడ్డితో కలిసి నిర్మించారు. ఇందులో వెంకటేష్ మహా, తరుణ్ భాస్కర్, బిందు మాధవి, మడోన్నా సెబాస్టియన్, ఫణి ఆచార్య తదితరులు నటించారు. నాలుగు కథలతో రూపొందిన ఆంథాలజీ సిరీస్ ఇది. ఎలా ఉంది (Anger Tales Review)?


Benefit Show : స్టార్ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే?
అభిమాన హీరో నటించిన 'బ్లాస్టర్' సినిమా బెనిఫిట్ షో వేయడానికి రంగ (వెంకటేష్ మహా) ఏర్పాటు చేస్తాడు. రూ. 70 టికెట్టును 1200లకు అమ్ముతాడు. రాత్రి ఎనిమిది గంటలకు పడాల్సిన షో పన్నెండు అయినా పడదు. అప్పుడు యువ రాజకీయ నేత పచ్చబొట్టు శీను (సుహాస్)కు, రంగాకు గొడవ అవుతుంది. సినిమా పోయిందని శీను కామెంట్ చేస్తే రంగ ఫైర్ అవుతాడు. హిట్టు సినిమా అని వాదిస్తాడు. ఒకవేళ ఫ్లాప్ అయితే శీను చెప్పింది చేస్తానని చెబుతాడు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పుడు రంగాను శీను ఎలా అవమానించాడు? హైదరాబాదులో హీరో ఇంటికి వచ్చిన రంగా ఏం చేశాడు? అనేది మిగతా కథ. 


Food Festival : ఏం తినాలో కూడా చెబితే?
పూజ (మడోన్నా సెబాస్టియన్ - Madonna Sebastian)ను ఎగ్స్ తినమని డాక్టర్ చెబుతుంది. లేకపోతే కష్టమని, చాలా వీక్‌గా ఉన్నావని స్పష్టం చేస్తుంది. ఆ విషయం భర్త రాజీవ్ (తరుణ్ భాస్కర్)కు చెబితే ఆయుర్వేద వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి కాషాయం ఇప్పిస్తాడు. రాజీవ్, పూజలది వీగన్స్ ఫ్యామిలీ. వాళ్ళు ఉండేది కూడా వీగన్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్‌లో! అందువల్ల, గుడ్డు తినడానికి కూడా ఒప్పుకోడు. అందుకని, భర్త & అత్తమ్మకు తెలియకుండా కోడిగుడ్లు తీసుకొచ్చి ఇంట్లో దాచి తింటూ ఉంటుంది. ఈ విషయం తెలిశాక అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు ఏమన్నారు? పూజను రాజీవ్ ఏమన్నాడు? చివరకు, పూజ ఏం చేసింది? అనేది మిగతా కథ.


An Afternoon Nap : అద్దె ఇంట్లో తలనొప్పులు వస్తే?
రాధ (బిందు మాధవి) కుటుంబం అద్దె ఇంట్లో ఉంటుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం గంట సేపు నిద్రపోవడం రాధకు అలవాటు. ఓనర్స్ బంధువులు వచ్చిన తర్వాత రోజూ మెట్ల మీద కూర్చుని బాతాఖానీ పెట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారు. దాంతో రాధ తల పగిలినట్టుగా ఉంటుంది. డాక్టర్ దగ్గరకు వెళితే మైగ్రేన్ ఉందని తెలుస్తుంది. ఆ విషయం చెప్పిన తర్వాత కూడా ఓనర్స్ తీరు మారదు. దానికి తోడు భర్త (రవీంద్ర విజయ్) నుంచి కూడా సహకారం అందదు. అప్పుడు రాధ ఏం చేసింది? ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయమని ఎందుకు చెప్పారు? అనేది మిగతా కథ.
 
Helmet Head : జుట్టు ఊడితే ఎన్ని సమస్యలు అంటే?
గిరిధర్ (ఫణి ఆచార్య) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఉద్యోగి. అతనికి జుట్టు లేదు. దాంతో పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకుంటానంటే పెద్దమ్మ (సుధ) ఒప్పుకోదు. సరిగ్గా ఉద్యోగం పోయిన రోజు ఓ సంబంధం వస్తుంది. అదీ క్యాన్సిల్ అవుతుంది. ఇంట్లో గొడవ జరుగుతుంది. మర్నాడు ఉదయం పెద్దమ్మ మరణిస్తుంది. ఆమె ఇన్సూరెన్స్ డబ్బులతో గిరి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? బట్టతల వల్ల అతను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇంట్లో గొడవ జరగడానికి ముందు పెళ్లి సంబంధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? కోర్టులో ఫణి కేసు ఏం కేసు వేశాడు? ఎందుకు వేశాడు? అనేది అసలు కథ.


విశ్లేషణ : 'యాంగర్ టేల్స్'లో నాలుగు కథలు ఉన్నాయి. ఏ కథకు ఆ కథ వేరుగా ఉంటుంది. అయితే, నాలుగు కథల్లో ఉన్న ఎమోషన్ ఒక్కటే... రెబలిజమ్! తమ బాధను ఎదుటి వ్యక్తికి తెలియచేయడం! తిరుగుబాటు చేయడం! నాలుగు కథలో రెండు కథలు అమితంగా ఆకట్టుకుంటాయి. రెండు కథలు సోసోగా ఉంటాయి. ప్రేక్షకుల మీద ఇంపాక్ట్ చూపించావు. పైగా, ఆ కథలకు ఇచ్చిన ముగింపు కూడా ఆసక్తిగా ఉండదు. 


ఫుడ్ విషయంలో అని కాదు గానీ... ఇంట్లో ప్రతి విషయంలో నియంత్రించే భర్త ఉంటే మహిళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది చెప్పడానికి మడోన్నా సెబాస్టియన్ కథను ఉదాహరణగా పేర్కొనవచ్చు. అయితే, ఆ కథను సాదాసీదా చెప్పేశారు. రెండో కథలో కొత్త విషయం ఏమీ లేదు. హిందీ 'బాలా', తెలుగు 'నూటొక్క జిల్లాల అందగాడు'లో చెప్పిన విషయాన్ని కొత్తగా చెప్పాలని ట్రై చేశారు. దర్శక, రచయితలు ఆ కథల విషయంలో మరింత వర్క్ చేయాల్సింది. తరుణ్ భాస్కర్, మడోన్నా నటన ఓకే. నటుడిగా ఫణి ఆచార్య మెరిశారు.


బిందు మాధవి నటన కారణంగా ఆమె కథ ఆకట్టుకుంటుంది. సగటు మధ్య తరగతి మహిళ పాత్రలో జీవించారు. స్టార్ హీరో అభిమానిగా వెంకటేష్ మహా మంచి నటన కనబరిచారు. సుహాస్ గురించి చెప్పేది ఏముంది? సింప్లీ సూపర్బ్. ఆన్ స్క్రీన్ హీరోలు వీళ్ళు అయితే... ఆఫ్ స్క్రీన్ హీరో మాత్రం స్మరణ్ సాయి. ఆయన మ్యూజిక్ కొత్తగా ఉంది. నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ప్రతి కథలో సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి. 


Also Read : 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ


చివరగా చెప్పేది ఏంటంటే? : 'యాంగర్ టేల్స్' - రాధ & రంగ సాధించిన విజయం ఇది. అందులో మరో సందేహం అవసరం లేదు. వాళ్ళిద్దరి నటన, ఎమోషన్స్ కొన్ని రోజులు మనతో ఉంటాయ్. అంతలా వాళ్ళు నటించారు. ఆఫ్ స్క్రీన్ హీరో స్మరణ్  సాయి మంచి నేపథ్య సంగీతం అందించారు. నితిన్ ప్రభల తిలక్ ఆ రెండు కథలను తెరకెక్కించారు. 'యాంగర్ టేల్స్'లో రాధ, రంగ కథలు మిస్ అవ్వొద్దు. 


Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?