Maharashtra Politics: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి మరో షాక్ తగిలింది. ఠాక్రేకు చెందిన 3 వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరిపోయారు.


ఇదీ జరిగింది


శివాజీ పార్కులో దసరా ర్యాలీ నిర్వహణకు ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు బొంబే హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ సభ కోసం ఠాక్రే వర్గం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి సమయంలో 3,000 మంది కార్యకర్తలు శిందే వర్గంలోకి వెళ్లిపోవడం గట్టి ఎదురుదెబ్బగా అంతా భావిస్తున్నారు. వీరంతా ఆదిత్య ఠాక్రే నియోజకవర్గం అయిన వర్లీకి చెందినవారే.


కోర్టు తీర్పు


ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీం కోర్టులో ఇటీవల భారీ షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే మధ్య ఏ వర్గాన్ని 'నిజమైన' శివసేన పార్టీగా గుర్తించాలి అనే అధికారం ఎన్నికల సంఘానికి ఉందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో శివసేన పార్టీ.. విల్లు, బాణం గుర్తును ఎవరికి కేటాయించాలనే అంశాన్ని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది.


ఏక్‌నాథ్ శిందే గ్రూప్‌ను అసలైన శివసేనగా గుర్తించకుండా ఈసీని నిలువరించాలని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఒక రోజు సుదీర్ఘ విచారణ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.


మాదంటే మాదని


శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో ఇరు వర్గాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తమదే నిజమైన శివసేన అని ఏక్‌నాథ్ శిందే వర్గం చెప్పటంతో పాటు, శివసేన
పార్టీ గుర్తుని తమకే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే విచారణ తేలేంత వరకూ ఎన్నికల సంఘం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం కోర్టు గతంలో తేల్చి చెప్పింది.


ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇంకా శివసేన ఎవరిది అన్న చర్చ వాడివేడిగా సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. శివసేనలో ఎవరికి మెజార్టీ ఉందో డాక్యుమెంట్ రూపంలో ఆధారాలు సమర్పించాలని ఏక్‌నాథ్‌ శిందేతో పాటు ఉద్ధవ్ ఠాక్రేను కూడా అడిగింది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎన్నోసార్లు స్పందించారు. బాలాసాహెబ్ స్థాపించిన శివసేనను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. 56 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఇలా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.



ఇది మహారాష్ట్ర ప్రజల్ని షాక్‌కు గురి చేసింది. బాలాసాహెబ్ ఠాక్రే 56 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారు. ఇలాంటి పార్టీపై ఈసీ అనుమానం వ్యక్తం చేస్తోంది. కేంద్రం మా పార్టీని నాశనం చేయాలని చూస్తోంది. శివసేనకు ఒకే ఒక లీడర్ ఉన్నారు. అది ఉద్దవ్ ఠాక్రే మాత్రమే.                                                   "
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ



ఇదే అంశమై గతంలో ఏక్‌నాథ్ శిందే కూడా స్పందించారు.



ఎన్నికల సంఘం చెప్పినట్టుగా నడుచుకుంటాం. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఆధారాలు సమర్పిస్తాం. శివసేన మాదే. మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది.                                             "
-    ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర సీఎం



Also Read: Watch Video: సీఎం కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్ విసిరిన దుండగుడు!


Also Read: Delhi: కత్తులతో పొడుస్తుంటే కుర్చీ వేసుకుని చూసిన వ్యక్తి - వీడియో వైరల్!