మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై దంపతులు అన్యోన్యంగా మెలిగితే వారి కాపురం నిండు నూరేళ్ళ పాటు స్వర్గంగా ఉంటుందని అంటారు పెద్దలు. క్షణిక సుఖాల కోసం పాకులాడి పండంటి కాపురాన్ని నిప్పుల కొలిమిలా మార్చుకుంటున్నారు కొందరు వివాహితులు.. భర్తతో సఖ్యతగా మెలగాల్సిన భార్య, యువకుల కామానికి దాసోహంగా మారి, పవిత్రమైన దాంపత్య జీవితానికి మాయని మచ్చను తెచ్చి పెడుతున్నారు.. అంతే కాకుండా ప్రియుడి వ్యామోహంలో పడి అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేసిన భర్తనే చంపేస్తున్నారు..తాజాగా  ప్రియుడి వ్యామోహంలో పడి భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ వివాహత ప్రియుడితో కలిసి స్కేచ్ వేసి భర్తను దారుణంగా గొంతు కోసి హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లా చోటు చేసుకుంది..


పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, గరిగచిన్నేపల్లి గ్రామానికి చెందిన హరీష్ కుమార్ కి స్నేహతో గత కొద్ది ఏళ్ళ క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.. పెళ్లైన తర్వాత కొద్ది రోజుల పాటు గ్రామంలో‌ ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు హరిష్.. అయితే అంతగా ఆదాయం లేక‌పోవడంతో తెలిసిన వారితో సంప్రదించి హైదరాబాదులో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ పనికి చేరి నెల నెల డబ్బులు పంపేవాడు.. ఇలా భర్త పంపిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడంతో‌ పాటు అత్త, మామలను బాగా చూసుకునేది స్నేహా.. ఈ సమయంలోనే పక్క గ్రామమైన టేకుమాను తాండాకు చెందిన సతీష్ నాయక్ తో పరిచయం ఏర్పడింది.. వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.. సతీష్ నాయక్ తో అక్రమ సంబంధం సాగిస్తూ, భర్తతో ఎప్పుడూ లాగే ఫోన్ లో ముచ్చట్లు చెబుతూ నమ్మించేది.. 


హైదరాబాదు లో గ్రానైట్ ఫ్యాక్టరీ లో‌ పని దొరక్క పోవడంతో హరీష్ తిరిగి సొంత గ్రామానికి చేరుకుని ఏదోక పని చేసుకోవాలని భావించి సొంత గ్రామానికి చేరుకున్నాడు.. అప్పటి నుండి గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు హరీష్.. తమ సంబంధానికి భర్త హరీష్ కుమార్ అడ్డు వస్తున్నాడని గ్రహించిన స్నేహా అతడిని అడ్డు తొలగించుకోవాలని స్కేచ్ వేసి ప్రియుడు సతీష్ నాయక్ కి సందేశం పంపింది.. 


ఐదుగురు కలిసి హత్య
సతీష్ అతని స్నేహితులు కుమార్ నాయక్, శ్రీధర్ నాయక్, చరణ్ నాయక్, బాలాజీలకు విషయం చెప్పి ప్రియురాలి భర్తను హత మార్చేందుకు ఐదు లక్షల రూపాయలకు సుపారి ఇచ్చి, 30 వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు.. స్నేహా, సతీష్ నాయకులు ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం కృష్ణపురం అటవీ ప్రాంతంలో స్నేహితుడు డబ్బులు ఇస్తారని అక్కడికి వెళ్లి తీసుకొని రావాలని స్నేహ భర్తకు తెలపడంతో వెళ్లిన హరీష్ ని అక్కడే కాపు కాసిన ఐదు మంది ఒక్కసారిగా కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.


అయితే గత నెల 25వ తేదీన తన భర్త హరీష్ కనిపించడం లేదని స్నేహా కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో కేసు‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించారు.. ఈ సమయంలో గత నెల 28వ తేదీన కృష్ణాపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. ఇదే విషయాన్ని స్నేహకి‌ ఫోన్ చేసి హరీష్ మృతిదేహం అవునో కాదో అని తేల్చేందుకు పిలిపించారు.. ఆ సమయంలో స్నేహా ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తన స్టైల్ లో విచారణ జరిపారు.. దీంతో అసలు విషయం బట్ట బయలు అయ్యింది.. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.