Konsaseema Cheera Meenu Price: గోదారోళ్లకు పులస తర్వాత అత్యంత ప్రీతిపాత్రమైనది చీరమేను. ఈ చేప రుచే వేరు. చిన్న సైజులో ఉండే చీర మేను చేప పేరు చెబితే అందరూ లొట్టలేసుకుని తింటారంటే నమ్మశక్యం కాదు. సీజనల్ చేప కావడంతో ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలలలో శీతాకాలం ప్రారంభం సమయంలో ఇది గోదావరి నదీ ముఖ ద్వారం వద్ద అంటే గోదావరి (తీపినీరు), సముద్రం (ఉప్పునీరు) కలిసే ప్రదేశాల్లో వాటికి ఆక్సిజన్ ఎక్కువగా ఉండే బ్రాకిస్ వాటర్ లో లభిస్తుంటుంది. చీరమేనును సోల, తవ్వ, సేరు గ్లాసు, బకెట్ కొలతల్లో అమ్ముతుంటారు. ప్రస్తుతం యానాం మార్కెట్లో లభిస్తుండడంతో మాంసాహార ప్రియులు చీర మేను కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
చీర మేను రికార్డు ధర
ప్లాస్టిక్ బకెట్లో ఉన్న 15 కేజీల చీర మేను శనివారం ధర రూ.34వేలకు పలికింది. యానాం మార్కెట్ లో చేపల విక్రయించే మత్స్యకార మహిళ ఆకుల సత్యపతి రూ.30 వేలకు వేలంపాటలో దక్కించుకోగా దానిని తిరిగి అమలాపురానికి చెందిన వాకపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రూ. 34 వేలకు కొనుగోలు చేశారు. ఈ చీరమేను నదీముఖద్వారంలో లభ్యం చీరలతో పడుతుంటారు. చిట్టిగా అంగుళం సైజులో ఉండే చీరమేను చేపలను వలతో పట్టడం సాధ్యం కాదు కాబట్టి దీనిని చీరల సహాయంతో గోదావరి ముఖ ద్వారాల్లో మత్స్యకారులు పడుతుంటారు.
ఆ రెండు నెలల్లోనే అధికం..
ముఖ్యంగా శీతాకాలం ప్రారంభంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో దసరా నుంచి దీపావళి వరకు ఈ చీరమేను వస్తుంటుంది. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న లిజార్డ్ ఫిష్ జాతికి చెందినదిగా చెబుతారు. సముద్రం, నదీ కలిసే ప్రదేశం వద్ద చల్లగా వీచే తూర్పుగాలులకు నీటి అడుగుభాగంలో ఉన్న చీర మేను కాస్తా నీటి పైకి వస్తుంటుంది. గుంపులు, గుంపులుగా అధిక సంఖ్యలో వచ్చిన చీరమేను చిన్నదిగా ఉండటంతో వలలను కాకుండా మత్స్యకారులు (AP Fishermen) చీరలను ఉపయోగించి పట్టుకుని దానిని ఒడ్డుకు చేరుస్తుంటారు. చీరలతో పట్టడం వల్లే దీనికి చీరమేను అనే పేరు వచ్చింది. యానాం, భైరవపాలెం తదితర ప్రాంతాల్లో చీరమేను ఎక్కువగా లభిస్తుంది. పులస చేపల తరువాత అంత డిమాండ్ ఉన్నది చీర మేను (Demand for Cheera Meenu after Pulasa fish)కు మాత్రమే.
కూరగా, గారెలుగా...: చీరమేనును మాములు చేపల కూరలా కాకుండా ప్రత్యేకమైన పద్ధతిలో పండుతుంటారు. దీనిని చాలామంది చింతకాయ, చింతకూర వేసుకుని ఇగురు పెట్టుకుంటారు. అంతేకాకుండా గారెలుగా వేసుకుని ఎక్కువగా తింటుంటారు. ఇలా వివిధ రకాలుగా చీరమేనును ప్రైగా సైతం చేసుకుని వండుకుంటారు.
శాస్త్రీయంగా (Gracile lizardfish) సారిడా గ్రాసిలిస్, టంబిల్, ఆండోస్క్వామిస్ జాతులకు చెందిన పిల్ల చేపల్నే చీరమీనుగా పిలుస్తారు గోదావరీవాసులు. సముద్రనీరూ, గోదావరీ జలాలూ కలిసే బురదనీటి మడుగుల్లో - అంటే మడ అడవులు ఎక్కువగా పెరిగే ఆ నీళ్లలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉండటంతో ఆ జాతులకు చెందిన చేపలు అక్కడికి వచ్చి గుడ్లు పెడతాయి. సముద్రంమీద తూర్పుగాలులు వీచగానే ఆ బురదనీటిలోని గుడ్లన్నీ పిల్లలుగా మారి ఒక్కసారిగా గోదావరీ జలాల్లోకి ఈదుకొస్తాయి.