నాకు 45 ఎమ్మెల్యేల మద్దతు ఉంది: ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. రాజీనామాకు సిద్ధం అంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే ప్రకటించగా..అటు ఏక్‌నాథ్ షిండే తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తన వద్ద 40 మంది ఎమ్మెల్యేలున్నారని పేర్కొంటూ గవర్నర్‌కు లేఖ సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ 40 మందితో పాటు మరో 5గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతూ తనకు ఉందని ఈ లేఖలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలందరినీ గువాహటిలోని రాడిసన్ హోటల్‌లో ఉంచారు ఏక్‌నాథ్ షిండే. మరో కీలక అంశం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్‌నాథ్..కొత్త పార్టీ పెడతారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. గవర్నర్‌కు లేఖ సమర్పించిన సమయంలోనే కొత్తపార్టీ గుర్తునీ ప్రతిపాదించనున్నట్టు ఏబీపీ న్యూస్ సోర్సెస్ ద్వారా తెలిసింది.
ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రానట్టేనా..
సాధారణంగా పార్టీలో మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఫిరాయింపుల చట్ట చర్యల నుంచి తప్పించుకోవచ్చు.అయితే శివసేనకు శాసనసభలో 55 మంది ఎమ్మెల్యేలున్నారు. అంతకు ముందు 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా నిలిచారు. తరవాత ఈ సంఖ్య 45కి పెరిగింది. ఇలా చూస్తే ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఆధారంగా చర్యలు తీసుకోవటానికి వీల్లేకుండా పోయింది. ఇప్పటికే శివసేన మూడు సార్లు చీలిపోయింది. 1990లో చగన్ భుజ్‌బల్ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. తరవాత 2005లో నారాయణ్ రానే శివసేనను వదిలి కాంగ్రెస్‌లో చేరారు. 2005లోనే రాజ్ థాక్రే పార్టీని వీడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరిట సొంత పార్టీని స్థాపించారు.
ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలుపుతున్న వారిని హోటల్‌లో ఉంచి రాజకీయం చేయటంపై అసోంలోని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిరసనలు చేపడుతోంది. వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే అధికార భాజపా, మహారాష్ట్రలోని థాక్రే సర్కార్‌ని కూల్చే పనిలో ఉందని విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ర్యాడిసన్ హోటల్ ముంది టీఎమ్‌సీ కార్యకర్తలు, నేతలు ఆందోళనలు చేపట్టారు. ఇక ఏక్‌నాథ్ షిండే మద్దతుదారులు మాత్రం కొత్త పార్టీ పెట్టేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అదే నిజమైతే బల పరీక్షలో నెగ్గాల్సిన అవసరముంది. ఈలోగా ఈ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో అన్నదీ ఆసక్తికరంగా మారింది.