ప్రధాని మోదీతో కీలక భేటీ..


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. సీఎం హోదాలో శిందే ప్రధానిని కలవటం ఇదే తొలిసారి. దిల్లీలో రెండ్రోజుల పర్యటన నేపథ్యంలో శిందే, మోదీతో భేటీ అయ్యారు. త్వరలోనే మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ పూర్తవుతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. సీఎం శిందే కూడా గతంలో చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. భాజపా పెద్దలతో సంప్రదింపులు జరిపాకే మంత్రివర్గ విస్తరణ చేపడతామని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడుతుండటం వల్ల ముఖ్యమంత్రి శిందే, ప్రధాని మోదీని కలిశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీఎం ఆఫీస్‌ ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా సీఎం శిందే కీలక వ్యాఖ్యలు చేశారు. "మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందరూ అనుక్షణం భయపడాల్సి వచ్చింది. వారికి తగిన ప్రాధాన్యత దక్కలేదు. అప్పుడు మేము మాట్లాడటానికి కూడా అవకాశం రాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. శివసేన, భాజపా కూటమితోనే మహారాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది" అని వెల్లడించారు. 


డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ కూడా స్పందించారు. "గతంలో అధిష్ఠానం నన్ను ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడు పార్టీ ఆదేశాలకు మేము కట్టుబడి ఉన్నాం. ఏక్‌నాథ్ శిందే మా నాయకుడు. ఆయన నేతృత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో అన్యాయ పాలనకు తెరపడి, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వచ్చింది" అని వ్యాఖ్యానించారు.