Eknath Shinde Death Threat:
రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికలు
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందేకు భద్రత పెంచారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో...ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేట్ ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్ (SID)కమిషనర్ అశుతోష్ డుంబ్రే...ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఏక్‌నాథ్ శిందేకి ప్రాణహాని ఉందని తమకు పక్కా సమాచారం వచ్చిందని స్పష్టం చేశారు. "సమాచారం సరైందని ధ్రువీకరించుకున్నాకే...అవసరమైన చర్యలు తీసుకున్నాం. సీఎం సెక్యూరిటీని పెంచాం" అని వెల్లడించారు. ప్రస్తుతానికి Z ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. థానేలోని షిందే ప్రైవేట్ రెసిడెన్స్ వద్ద కూడా భద్రత పెంచారు. ముంబయిలోనూ ఆయన నివాసం వద్ద సెక్యూరిటీ పెరిగింది. అయితే..ఈ బెదిరింపులపై ఏక్‌నాథ్ షిందే స్పందించారు. "ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. మా హోం మంత్రిత్వ శాఖ, హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై నాకు పూర్తి నమ్మకముంది. నన్ను అలాంటి బెదిరింపులు భయపెట్టలేవు. ప్రజల కోసం నేను పని చేయటాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నేను నా రీతిలో పని చేసుకుంటూ పోతాను" అని షిందే బదులిచ్చారు. గతేడాది అక్టోబర్‌లోనూ షిందేకు నక్సలైట్‌ల నుంచి బెదిరింపు లేఖ అందింది. అప్పుడు ఆయన పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. గడ్చిరోలికి గార్డియన్ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
రాజకీయ మలుపులు..
అటు మహారాష్ట్రలో రాజకీయాలు మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి మరో షాక్ తగిలింది. ఠాక్రేకు చెందిన 3 వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరిపోయారు. శివాజీ పార్కులో దసరా ర్యాలీ నిర్వహణకు ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు బొంబే హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ సభ కోసం ఠాక్రే వర్గం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి సమయంలో 3,000 మంది కార్యకర్తలు శిందే వర్గంలోకి వెళ్లిపోవడం గట్టి ఎదురుదెబ్బగా అంతా భావిస్తున్నారు. వీరంతా ఆదిత్య ఠాక్రే నియోజకవర్గం అయిన వర్లీకి చెందినవారే.ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీం కోర్టులో ఇటీవల భారీ షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే మధ్య ఏ వర్గాన్ని 'నిజమైన' శివసేన పార్టీగా గుర్తించాలి అనే అధికారం ఎన్నికల సంఘానికి ఉందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో శివసేన పార్టీ.. విల్లు, బాణం గుర్తును ఎవరికి కేటాయించాలనే అంశాన్ని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఏక్‌నాథ్ శిందే గ్రూప్‌ను అసలైన శివసేనగా గుర్తించకుండా ఈసీని నిలువరించాలని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఒక రోజు సుదీర్ఘ విచారణ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో ఇరు వర్గాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
Also Read: తెలంగాణలో 13 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర, పూర్తి షెడ్యూల్ ఇదే