టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగుతున్నారు. కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉన్నారు. అయితే, జాతీయ పార్టీగా ఏర్పడితే పరిస్థితి ఏంటి? జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆరే కచ్చితంగా ఉంటారు. మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారాక రాష్ట్ర అధ్యక్షుడిగా తనయుడు కేటీఆర్‌ను నియమిస్తారని అంటున్నారు.
అక్టోబరు 5న ముహూర్తం
ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనే నిర్ణయం మేరకు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ పేరును జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా మార్చనున్న సంగతి తెలిసిందే. ఈ పేరు మార్పు ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకి పేరు ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ఆమోదం తెలుపుకున్న అనంతరం, తర్వాతి రోజు అంటే ఈ నెల 6న ఢిల్లీకి టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లనుంది.
ఈసీకి దరఖాస్తు
టీఆర్ఎస్ పేరును జాతీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తారు. దాన్ని ఆమోదిస్తే వెంటనే ఆ పేరు అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో పార్టీ చేరుతుంది. ఇక కొత్తగా ఏర్పాటైన జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఉంటారు. తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ప్రస్తుత టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమించే అవకాశం ఉంది. జాతీయ పార్టీగా పేరుకు ఆమోద ముద్ర పడ్డాక, ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దాని ప్రకారం పార్లమెంటులో, శాసన సభలో, శాసన మండలిలో పార్టీ పేరును కూడా మార్చుతారు. శాసన సభలో పార్టీ పక్ష నేతగా కేసీఆర్ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. జాతీయ పార్టీ తరఫున తొలుత సమన్వయ కర్తలను నియమించి ఆ తర్వాత కొత్త జాతీయ పార్టీకి రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమించే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలతో పాటు సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలను తర్వాత కొనసాగిస్తారని తెలుస్తోంది.
కొత్త పార్టీ ఏర్పాటా? లేక ఉన్న పార్టీ పేరునే మార్చుతారా?
జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో నంబర్ వన్ గా ఉన్న టీఆర్ఎస్ ను అలాగే కొనసాగిస్తారా? లేక జాతీయ పార్టీ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ను అందులో విలీనం చేస్తారా? అదీ కాకుండా టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా మార్చుతారా? అనే అంశంలో స్పష్టత లేదు. రెండు వేర్వేరు పార్టీలు ఉంటే రాష్ట్రంలో గందరగోళం ఏర్పడుతుందని, టీఆర్ఎస్ పేరుతో వెళితే ఇతర రాష్ట్రాల్లో ఆదరణ ఉండదనే అభిప్రాయాలు వచ్చాయి. అందుకని ప్రాంతీయ పార్టీ పేరునే మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేయాలనే వ్యూహాన్ని అనుకుంటున్నట్లుగా సమాచారం. కొత్తగా పార్టీ పెడితే కారు గుర్తు ఉండక పోవచ్చు కాబట్టి, పార్టీకే పేరు మార్చడం వల్ల గుర్తు మారే సమస్య తలెత్తదని కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.