Maha Lakshmi Scheme: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటకయ్యాక రెండు గ్యారంటీలపై సంతకం చేశారు. అందులో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఒకటి. డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం ఆరు గ్యారెంటీలను వందరోజుల్లోపు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మీ స్కీమ్ కింద బాలికలు, విద్యార్థినులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు ఇవే..
బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో డిసెంబర్ 9 నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు
తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే బస్సులలో అయితే రాష్ట్ర సరిహద్దు వరకు ఉచితం, బార్డర్ నుంచి డెస్టినేషన్ వరకు మాత్రమే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది
కిలోమీటర్ల పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు. తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్ కు కూడా ఉచిత ప్రయాణం
హైదరాబాద్ లో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి
ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయనుంది ఆర్టీసీ.
శనివారం ( డిసెంబర్ 9) నుంచి ఆర్టీసీలో బాలికలు, మహిళలు, థర్డ్ జెండర్స్ కు ఉచిత ప్రయాణం కల్పించాలని ఇప్పటికే ఆర్టీసీ సిబ్బంది ఆదేశాలు ఇచ్చినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
మహాలక్ష్మీ పథకానికి సంబంధించి ఓ సాఫ్ట్ వేర్ డెవలప్ చేసి స్మార్ట్ కార్డులు అందించనున్నారు.
తొలి వారం రోజులపాటు ఎలాంటి స్మార్ట్ కార్డు లేకుండా ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నారు.
మహాలక్ష్మి పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. డిసెంబర్ 9న మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభించనున్నారు. మహిళా మంత్రులు, సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని, ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
మహాలక్ష్మి పథకం కోసం 7,200 సర్వీసులను ఉపయోగిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానికత ధ్రువీకరణ గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించాలని సూచించారు. సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని డిసెంబర్ 9 నుండి మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. చేయూత పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా 10 లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రులు ప్రకటించారు.