ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మహారాష్ట్ర మంత్రి అనిల్ పరబ్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం దుమారం రేపుతోంది.  శివసేన వర్గాలు ఇది రాజకీయ కక్ష సాధింపు అంటున్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల కిందట సీఎం ఉద్దవ్ ధాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా  కేంద్రమంత్రి నారాయణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆయనను అరెస్ట్ చేసింది రత్నగిరి జిల్లా పోలీసులు. ఆ రత్నగిరి జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు అనిల్ పరబ్. ఆయన ప్రోద్భలంతోనే  నారాయణ్ రాణె అరెస్ట్ జరిగిందన్న ఉద్దేశంతో బీజేపీ ఈడీ నోటీసులు జారీ చేయించిందని ఈడీ అనుమానిస్తోంది. నిజానికి అనిల్ పరబ్‌పై ఎలాంటి ఈడీ కేసులు లేవు. కానీ కొద్ది రోజుల కిందట రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ముందు బాంబులు ఉంచిన ఘటన తర్వాత జరిగిన పరిణామాల్లో మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.  


ముంబై మున్సిపల్ కమిషనర్‌ను తొలగించడంతో ఆయన హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వంద కోట్ల  దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకూ ఈకేసుల్లో ఇతర మంత్రుల ప్రమేయం ఉందని కానీ వారికి నోటీసులు ఇస్తారన్న  ప్రచారం కానీ జరగలేదు. కానీ రాణే ఇష్యూ తర్వాత తొలి సారి మంత్రి అనిల్ పరబ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను శివసేన సీరియస్‌గా తీసుకుంది. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలు చేసి అలసి పోయిందని.. ఇప్పుడు ఇలాంటి నోటీసులతో ఏం చేస్తుందని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అవి తమకు ప్రేమ లేఖలేనని చెప్పుకొచ్చారు.  ఈడీ ఆఫీసులో బీజేపీ నేతలు లేకపోతే ఈడీ అధికారులే బీజేపీలోనో పని చేస్తూ ఉండాలని ఆయన  సెటైర్ వేశారు. 


బీజేపీ అధికారంలో లేని మరో రాష్ట్రం బెంగాల్‌లోనూ ఈడీ దూకుడు చూపిస్తోంది.  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు.. తృణమూల్ ముఖ్య నేతల్లో ఒకరైన అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్యకూ నోటీసులు జారీ చేసింది.  రెండు వేర్వేరు తేదీల్లో వారు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ తీరుపై మమతా బెనర్జీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే తమతో రాజకీయంగాఎదుర్కోవాలి కానీ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకోవడం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. అటు బెంగాల్‌లో  ఇటు మహారాష్ట్రలో ఈడీ దూకుడుగా ఉండటంతో రెండు రాష్ట్రాల్లో రాజకీయం రాజుకుంటోంది. అయితే బీజేపీ మాత్రం.. తమకేం సంబంధం అని వాదిస్తోంది.