Madurai Student Arrested: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్‌లోని ఓ విద్యార్థిని సహచరుల నగ్న వీడియోలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీనిని మర్చిపోకముందే తమిళనాడులోనూ అలాంటి ఘటనే ఒకటి జరిగింది.


తమిళనాడులోని మధురైలో ఒక విద్యార్థిని తన హాస్టల్ మేట్స్ అభ్యంతరకరమైన వీడియోలు, చిత్రాలను తన బాయ్‌ ఫ్రెండ్‌కు షేర్ చేసింది. ఈ కేసులో ఆమెను, తన బాయ్‌ ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇదీ జరిగింది


నిందితురాలు కాళేశ్వరి ఓ ప్రైవేట్ కాలేజీలో బీఈడీ చదువుతోంది. కముది ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన అసిక్ (31) అనే వైద్యుడితో కాళేశ్వరికి పరిచయం ఏర్పడింది. అసిక్.. అదే ప్రాంతంలో ఓ క్లినిక్ నపుడుతున్నాడు.


మూడేళ్ల క్రితం పెళ్లయిన అసిక్.. కాళేశ్వరితో స్నేహం చేసి, తన హాస్టల్ మేట్స్ స్నానం చేసి, డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో వీడియోలు చిత్రీకరించాలని ఆమెను బలవంతం పెట్టాడు. దీంతో కాళేశ్వరి తన హాస్టల్‌లోని అమ్మాయిలు స్నానం చేస్తుండగా తన మొబైల్‌తో చిత్రీకరించి వాటిని అసిక్‌కు పంపుతూ వచ్చేది.


అనుమానం వచ్చి


అయితే ఇటీవల కాళేశ్వరి రూమ్‌మెట్ అయిన ఓ అమ్మాయికి అనుమానం వచ్చింది. కాళేశ్వరి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు, ఫొటోలు కనిపించాయి. వాటిని చూసి ఆమె షాకైంది. వెంటనే ఆ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లింది. వార్డెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాళేశ్వరి, అసిక్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


పంజాబ్‌లో


పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. యూనివర్సిటీ హాస్టల్‌లో తోటి విద్యార్థినిలు స్నానం చేస్తున్న వీడియోలను తీసిన ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్‌కు వాటిని పంపింది. ఈ వీడియోలను అతను ఇంటర్నెట్‌లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలు పోర్న్ సైట్‌లో కనిపించడంతో యూనివర్సిటీ విద్యార్థినిలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.


యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనలతో దద్దరిల్లింది. క్యాంపస్‌లోని హాస్టల్‌లో విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో దుమారం చెలరేగింది. ఈ ఘటనపై చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేసినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అయితే ఆమె ఫోన్‌లో ఒక వీడియో తప్ప మరే వీడియో లేదని పోలీసులు తెలిపారు. ఆ వీడియో కూడా నిందితురాలికి సంబంధించినదేనని దర్యాప్తులో తేలిందన్నారు. ఆమె మరెవరి వీడియోను రికార్డ్ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.


Also Read: FIR Against Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్, అసోం సీఎం హిమంతపై కేసు- ఎందుకంటే?


Also Read: Kullu Bus Accident: లోయలో పడిపోయిన టెంపో ట్రావెలర్- ఏడుగురు మృతి!