FIR Against Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్, అసోం సీఎం హిమంతపై కేసు- ఎందుకంటే?

ABP Desam   |  Murali Krishna   |  26 Sep 2022 11:47 AM (IST)

FIR Against Sadhguru: ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదైంది.

(Image Source: PTI)

FIR Against Sadhguru: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై కేసు నమోదైంది. ఆదివారం కజిరంగా జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వీరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లినందుకు ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.

సీఎం, సద్గురుతో పాటు వారితో వెళ్లిన మంత్రి, ఇతరులపైనా గ్రామస్థులు కేసు పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరందరినీ వెంటనే అరెస్టు చేయాలని అందులో పేర్కొన్నారు.

విరుద్ధం

వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్దంగా వీరు పార్కులో సూర్యాస్తమయం తర్వాత సఫారీ యాత్ర చేసినట్లు సమాచారం. పార్కు సమీపంలోని గ్రామస్థులు బోకాఖాట్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు పెట్టారు. దీనిపై పోలీసులు కూడా స్పందించారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్, సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదైన విషయం వాస్తవమే. అయితే ఆ పార్కు అటవీ శాఖ కిందకు వస్తుంది. అందుకే ఆ అధికారులను స్టేటస్ రిపోర్టు కోరాం. -                                                పోలీసులు 

అటవీ శాఖ

ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉందన్నారు. కానీ సీఎం అధికారిక కార్యక్రమంలో భాగంగానే సఫారీ యాత్రకు వెళ్లారని, ఇది నిబంధనలను అతిక్రమించినట్లు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు సీఎం కార్యక్రమాలు ఆలస్యం అవుతాయన్నారు.

సీఎం రియాక్షన్

ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. జాతీయ పార్కులోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్లొద్దని చట్టంలో ఎక్కడా నిబంధన లేదన్నారు.

అధికారుల అనుమతితోనే నేను సఫారీ యాత్రలో పాల్గొన్నాను. అనుమతి ఉంటే ఉదయం 2 గంటలకు కూడా పార్కులోకి వెళ్లొచ్చు. అయినా సూర్యాస్తమయం తర్వాత పార్కులోకి వెళ్లొద్దని ఏ చట్టంలోనూ లేదు.                                                     - హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం

Also Read: Kullu Bus Accident: లోయలో పడిపోయిన టెంపో ట్రావెలర్- ఏడుగురు మృతి!

Also Read: Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Published at: 26 Sep 2022 11:31 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.