Lookout Notice For Prajwal Revanna: లైంగిక వేధింపుల అంశం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. జేడీఎస్ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నిందితుడిగా ఉన్న ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక హోం మంత్రిత్వ శాఖ ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హోం మంత్రి జి పరమేశ్వర కీలక ప్రకటన చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఒకవేళ ఆయన విచారణకు హాజరుకాకపోతే ఎక్కడున్నా అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే వారం రోజుల పాటు గడువు కావాలంటూ రేవణ్ణ విజ్ఞప్తి చేయగా...అందుకు సిట్ అంగీకరించలేదు. తక్షణమే విచారణకు హాజరుకావాలని తేల్చి చెప్పింది. తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ పెట్టిన కేసుతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి HD రేవణ్ణపైనా ఇవే ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో వంట మనిషిగా చేసిన బాధితురాలు మరి కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. తనతో పాటు తన కూతురినీ ఇలానే ఇబ్బంది పెట్టారని, వీడియో కాల్స్‌లో వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కర్ణాటక హోం శాఖ సీరియస్ అయింది. వెంటనే వచ్చి హాజరు కాకపోతే అరెస్ట్ తప్పదని స్పష్టం చేసింది.
అవి మార్ఫింగ్ వీడియోలు: లాయర్
అయితే...ప్రజ్వల్ రేవణ్ణ తరపున న్యాయవాది మాత్రం ఈ కేసులోని అన్ని కోణాలనూ పరిశీలించాల్సిన అవసరముందని వాదిస్తున్నారు. రేవణ్ణ అడిగినట్టుగా వారం రోజుల సమయం ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. విచారణలో ఎలాంటి అవకతవకలు జరగవని వివరిస్తున్నారు. అంతే కాదు. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వీడియోల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ కాదని, ఎవరో కావాలనే మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ఇప్పటికే విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టు వెల్లడించారు. అయితే...ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. బీజేపీ, జేడీఎస్ కలిసి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేసి విమర్శలు సంధిస్తోంది. ఏ నేతనైతే ప్రధాని మోదీ పదేపదే ప్రశంసించారో ఇప్పుడదే వ్యక్తి ఇలాంటి ఓ కేసులో ఇరుక్కుని దేశం నుంచి పారిపోయారని ప్రియాంక గాంధీ విమర్శించారు. వందలాది మహిళల జీవితాలను నాశనం చేశాడని తెలుస్తోందని, అయినా మోదీ మౌనంగా ఉంటారా అంటూ ప్రశ్నించారు. దీనిపై కేంద్రహోం మంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యక్తుల్ని బీజేపీ అసలు సహించదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకుండా ఏం చేశారంటూ కాంగ్రెస్‌నే తప్పుబట్టారు. కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కావాలనే ఆలస్యం చేసి రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వల్లే నిందితుడు దేశం వదిలి పారిపోయారని ఫైర్ అయ్యారు.
Also Read: Viral Video: ప్రచారం చేస్తుండగా మసీదులో నమాజ్, స్పీచ్ ఆపేసిన బీజేపీ నేత - వీడియో వైరల్