Viral Video: లోక్‌సభ ఎన్నికల ప్రచారం అన్ని రాష్ట్రాల్లో జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అసోం మంత్రి బీజేపీ నేత పిజూష్ హజారికా ఎన్నికల ప్రచారం చేస్తుండగా పక్కనే మసీదులో నమాజ్‌ వినిపించింది. వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి అలాగే వేదికపై నిలబడిపోయారు హజారికా. ఆ నమాజ్‌ అయిపోయేంత వరకూ అలాగే ఉన్నారు. అది పూర్తైన తరవాత ప్రసంగాన్ని కొనసాగించారు. అసోంలోని బక్సా జిల్లాలో జరిగిందీ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమాజ్ వినిపించగానే ఆయన స్పీచ్‌ని ఆపేశారు. అసోంలోని కోక్రఝర్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. 




అసోంలో బర్పెట, దుబ్రీ, గువాహటి, కోక్రఝర్‌ నియోజకవర్గాలకు మే 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌తో అక్కడ మొత్తం 14 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఏప్రిల్ 19, 26 వ తేదీల్లో 10 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తైంది. మిగిలిన ఈ నాలుగు స్థానాలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కి చాలా కీలకం. ఇప్పటికే బీజేపీ 400 సీట్‌ల టార్గెట్ పెట్టుకుంది. ఇక్కడ ఎక్కువ మొత్తంలో స్థానాలు సాధిస్తే ఆ లక్ష్యం సులువవుతుందని భావిస్తోంది. అటు కాంగ్రెస్‌ కూడా ఇక్కడ వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే...త్వరలోనే పోలింగ్ జరగనున్న నాలుగు స్థానాల్లోనూ ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. వీళ్లంతా బీజేపీకే ఓటు వేస్తారా లేదా అన్నదే చెప్పడం కష్టంగా ఉంది. AIDUFతో పాటు కాంగ్రెస్ మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రచారాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అసోంలోని 14 స్థానాలకు బీజేపీ 7 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్, AIDUF చెరో మూడు సీట్లు సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ ప్రాబల్యం 9 సీట్లకు పెరిగింది. కాంగ్రెస్‌ గ్రాఫ్ మాత్రం తగ్గలేదు. అందుకే...ఈసారి ఆ గ్రాఫ్‌ని ఇంకాస్త పెంచుకోవాలని చూస్తోంది.