Air India Express: దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించాలని టాటా గ్రూప్ ఉత్సాహంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తన మహారాజాను దశాబ్ధాల తర్వాత తిరిగి భారత ప్రభుత్వం నుంచి వెనక్కి కొనుగోలు చేసింది. అయితే దీనిని ఏకీకరణ చేసేందుకు పనితీరును మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంత ఇబ్బందికర పరిస్థితులను టాటాలకు కలిగిస్తున్నాయి.


వివరాల్లోకి వెళితే టాటా గ్రూప్ సింగపూర్ సంస్థతో సంయుక్తంగా నిర్వహిస్తున్న విస్తారా విమాన సేవలు గతనెల నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాస్తవంగా పైలట్ల జీతాల విషయంలో కంపెనీ చేసిన మార్పులను వెతిరేకిస్తూ చాలా మంది పైలట్లు సామూహికంగా సెలవులపై వెళ్లటం కంపెనీకి పెద్ద కుదుపుగా నిలిచింది. ఈ క్రమంలో భారీగా విమానాల రద్దు, ఫ్రైట్ ఆపరేటింగ్ రూట్ల సంఖ్య తగ్గించటం వంటివి జరిగాయి. వరుసగా ఫైట్ల రద్దుపై ఏకంగా డీజీసీఏ నుంచి నోటీసులు సైతం విస్తారా పొందింది.


అయితే ఇప్పుడు టాటా గ్రూప్‌లోని మరో ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ సమస్యలు బయటపడుతున్నాయి. ఎయిర్‌లైన్‌లో నిర్వహణలోపంతో పాటు ఉద్యోగుల పట్ల వివక్ష కొనసాగుతోందని కొందరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ఆరోపిచంటం సంచలనంగా మారింది. దీనిని వారు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, సీఈవో అలోక్ సింగ్‌లకు ఏప్రిల్ 26న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (AIXEU) లేఖ రాసింది. 


ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, గతంలో ఎయిర్ ఏసియా ఇండియా విలీనం పురోగతిలో ఉంది. ఏవియేషన్ కంపెనీలోని దాదాపు 300 మంది ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందాయని యూనియన్ పేర్కొంది. మేనేజ్‌మెంట్ దురుసు ప్రవర్తన ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని ఉద్యోగుల సంఘం పేర్కొంది. ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్‌ల కోసం ఇంటర్వ్యూకు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులకు ఇంటర్వూలు క్లియర్ అయిన తర్వాత కూడా తక్కువ ర్యాంక్ ఉద్యోగాలను ఆఫర్ చేసినట్లు ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు కంపెనీ నుంచి ఎలాంటి స్పందనలేదు. 


ఇదిలా ఉండగా దేశంలోని విమానయాన రంగంలో మెజారిటీ వ్యాపారాన్ని హోల్డ్ చేస్తున్న ఇండిగో ఎయిర్ లైన్ మాత్రం మరోపక్క దీనిని వ్యాపార అవకాశంగా వినియోగించుకుంటోంది. ఇటీవలే కంపెనీ కొన్ని కొత్త విమానాల కోసం ఆర్డర్ సైతం పెట్టింది. టాటాలతో పోటీలో ఏమాత్రం తగ్గకుండా ఇండిగో తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. అయితే టాటా కంపెనీల్లో తొలిసారిగా వివక్ష అనే మాట వినిపిస్తున్న వేళ మేనేజ్మెంట్ దీనిని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.