Viral News: ఆరేళ్ల కొడుకు లావుగా ఉన్నాడని ఓ తండ్రి ఆ పిల్లాడితో ట్రెడ్‌మిల్ చేయించాడు. దానిపై పరిగెత్తలేక ఆ చిన్నారి కింద పడిపోతున్నాపదే పదే లాక్కొచ్చి దానిపై నిలబెట్టాడు. ఆ సమయంలో ఆ చిన్నారిని బెదిరించడమే కాకుండా విపరీతంగా కొట్టాడు. భయపడిపోయిన పిల్లాడు ఆ తరవాత ప్రాణాలు కోల్పోయాడు. chronic abuse కారణంగా బాలుడు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే..ఇదంతా 2021లో జరిగింది. కోర్టులో ఈ కేసు విచారణ సమయంలో తండ్రి బలవంతంగా ఆ చిన్నారితో ట్రెడ్‌మిల్ చేయించిన వీడియోని ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయింది. నిందితుడి దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే తండ్రిపై హత్యా నేరం నమోదైంది.
కొడుకుతో ట్రెడ్‌మిల్ చేయించే క్రమంలో చాలా కర్కశంగా ప్రవర్తించాడు నిందితుడు. కింద పడిపోతుంటే పైకి లాక్కురావడమే కాకుండా మెడపై గట్టిగా కొరికాడు. ఆ బాలుడి తల్లి ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉంది. ఆ జిమ్ వీడియో చూసినప్పటి నుంచి కన్నీళ్లు ఆగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిమ్‌కి వెళ్లొచ్చిన తరవాత చిన్నారి అనారోగ్యానికి గురయ్యాడు. తల్లి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. అప్పటికే బాలుడు మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతున్నాడు. ఆ తరవాత వైద్యులు సిటి స్కాన్ చేశారు. అప్పటికే బాలుడి ఆరోగ్యం విషమించింది. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడడం వల్ల చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.