All political parties in Telangana unhappy  Lookback 2024 : అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏడాది సాధారణంగా సాదాసీదాగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు అలసిపోయి ఉంటాయి. పెద్దగా రాజకీయం చేయకుండా సైలెంట్ గా ఉంటాయి.అయితే తెలంగాణ రాజకీయ పార్టీలకు మాత్రం అలాంటి అవకాశం లేదు. ఖర్చుకు ఖర్చు ..అలసట తప్పలేదు. 2023లో చివరిలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డిన పార్టీలు సహజంగా 2024లో రిలాక్స్ కావాల్సింది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఎవరికీ విశ్రాంతి లేకపోయింది. ఆ తర్వాత కూడా రాజకీయ పార్టీలు ఏ మాత్రం విశ్రమిచండం లేదు. ఓ రకంగా చూస్తే తెలంగాణ  రాజకీయ పార్టీలు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పుడే పరుగు పందెం ప్రారంభించాయి. అది కూడా హైస్పీడ్‌తో అందుకే. ఈ ఏడాది జరిగిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. 


పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోయిన బీఆర్ఎస్ 


పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకోవడం ఈ ఏడాది జరిగిన రాజకీయ పరిణామాల్లో అత్యంత కీలకమైనది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ కారణంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పార్టీగానే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు చాలా ప్రయత్నించారు. కేసీఆర్ విస్తృతంగా బస్సు యాత్ర ద్వారా పర్యటించారు. పదహారు స్తానాలు  గెలుస్తామని గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఆ పార్టీ ఒక్క సీటు కూడా  గెల్చుకోలేదు సరి కదా సగం స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఈ పరిణామం ఏ మాత్రం ఊహించనిది. కాంగ్రెస్ ఎనిమిది, బీజేపీ ఎనిమిది సీట్లు గెల్చుకోగా.. మజ్లిస్ తన హైదరాబాద్ కంచుకోటను నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా దారుణంగా పడిపోయింది. అది బీజేపీకి ట్రాన్స్ ఫర్ అయింది. అప్పట్నుంచి కేటీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు పార్టీని నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాది చివరిలో కవిత యాక్టివ్ అయ్యారు. 


అత్యధిక కష్టాలు బీఆర్ఎస్ పార్టీకే


పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన పార్టీకి 2023 చివరిలో గడ్డు పరిస్థితి తీసుకు వస్తే 2024లో ఇంకా మరిన్ని బాధలు తెచ్చి పెట్టాయి. ఒక్క లోక్ సభ సీటును గెల్చుకోలేకపోవడంతో పాటు పార్టీ అధినేత కుమార్తె కవిత అరెస్టు, విడుదల వ్యవహారాలు ఇబ్బంది పెట్టాయి. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కవిత జైల్లో ఉన్నప్పటికీ ప్రజలు సానుభూతి చూపలేదు. ఆ తర్వాత పార్టీ నేతలు వరుసగా జంప్ కొట్టడం ప్రారంభించారు. ఇప్పటికే పార్టీ తరపున గెలిచిన పది మంది పార్టీ మారిపోయారు. వారిపై అనర్హతా వేటు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసుల వల విసురుతున్న నసూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది  కేటీఆర్ , హరీష్ రావు  ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నారు. అదే ఆ పార్టీకి కాస్త రిలీఫ్ ఇస్తోంది . పార్టీ క్యాడర్ నమ్మకం కోల్పోకుండా చూసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. 


కాంగ్రెస్‌కు పర్వాలేదనే ఏడాది - కానీ అసంతృప్తే !


2023 చివరిలో సంచలన  విజయంతో కొత్త ఏడాదిలోకి అధికార పార్టీగా అడుగు పెట్టిన కాంగ్రెస్ 2024లో తిరుగులేని స్థానానికి చేరుకుంటామని అనుకుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పదమూడు నుంచి పదిహేను గెల్చుకుంటామని అనుకున్నారు. హైకమాండ్ కు కూడా అదే చెప్పారు. రేవంత్ రెడ్డి పదిహేను సీట్లు గెల్చుకోవాలన్న పట్టుదలతో పని చేశారు. బలమైన నేతల్ని ఏ పార్టీలో ఉన్నా చేర్చుకున్నారు. పదిహేను సీట్లు వచ్చి ఉంటే కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఈ పాటికి కీలక నేతగా మారి ఉండేవారు. కానీ ఎనిమిది సీట్లకే పరిమితం కావడంతో మంత్రి వర్గ విస్తరణకు అనుమతి తెచ్చుకోవడానికే తంటాలు పడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం బీఆర్ఎస్ ముప్పేట దాడి  చేస్తోంది . కేసీఆర్ తెరపైకి రానప్పటికీ కేటీఆర్, హరీష్ రావు మాత్రం ప్రతి విషయంలోనూ ప్రభుత్వంపై మీడియా, సోషల్ మీడియా సాయంతో దాడి చేస్త పరుగులు పెట్టిస్తున్నారు. బీఆర్ఎస్ కు కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఏడాది చివరిలో సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసింది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందనేది భవిష్యత్‌లో తెలుస్తుంది. ఈ ఏడాది కాంగ్రెస్ కు అంత గొప్పగా లేదు.. అలాగని తీసి పారేసేలా లేదు. అలా జరిగిపోయింది అంతే అనుకోవచ్చు. 


పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు - అయినా స్తబ్దుగా బీజేపీ


పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. కానీ ఆ పార్టీ ఈ ఏడాది మొత్తం నీరసంగానే ఉంది. తాము ప్రతిపక్షంలా గట్టిగా పోరాడలేకపోయామని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ స్వయంగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీకి కిషన్ రెడ్డి తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కేంద్రమంత్రిగా బిజీగా ఉంటున్నారు. తెలంగాణలో కొత్త అధ్యక్షుడ్ని నియమించలేదు. సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఎక్కువగా ఉండటంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఫలితంగా బీజేపీ పరిస్థితి చుక్కాని లేని నావలా సాగిపోతోంది. అసెంబ్లీ సమవేశాల్లోనూ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగ వ్యవహరిస్తున్నారు. 2025లో అయినా తమ జాతకం మారుతుందని బీజేపీ క్యాడర్ కోరుకుంటోంది.